2026 Celebrations: ప్రపంచంలోనే కొత్త ఏడాదికి స్వాగతం పలికే ప్రధాన నగరాల్లో ఒకటైన న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో 2026 వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అక్కడి అత్యంత ఎత్తైన భవనం ‘స్కై టవర్’ నుండి అద్భుతమైన బాణసంచా ప్రదర్శనతో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. సుమారు 17 లక్షల మంది నివాసితులు 787 అడుగుల ఎత్తు నుండి వెలువడిన 3,500 బాణసంచా విన్యాసాలను తిలకించారు. అయితే వర్షం కారణంగా అక్కడ వేడుకలు కొంతవరకు ప్రభావితమయ్యాయి. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో నార్త్ ఐలాండ్‌లోని కొన్ని చిన్న కార్యక్రమాలను అధికారులు రద్దు చేశారు.
ప్రపంచంలోనే మొదటగా 2026 ఎక్కడ వచ్చిందంటే?
పసిఫిక్ దేశమైన కిరిబాటిలో భాగమైన కిరితిమతి ద్వీపంలో ప్రపంచంలోనే అందరికంటే ముందుగా కొత్త ఏడాది మొదలైంది. దీనిని ‘క్రిస్మస్ ఐలాండ్’ అని కూడా పిలుస్తారు. ఇది UTC+14 టైమ్ జోన్‌లో ఉండటం వల్ల ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఇక్కడ క్యాలెండర్ మారుతుంది.
Also Read: దేశంలో రెండో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు రెడీ చేసిన ఏకైక సీఎం చంద్రబాబు!
Auckland kicks off 2026 celebrations with fireworks display launched from New Zealand’s tallest structure, Sky Tower. pic.twitter.com/9UcQ0DDrUH
— The Associated Press (@AP) December 31, 2025
ఇండోనేషియాలో సాదాసీదాగా వేడుకలు
ఇండోనేషియాలో ఈసారి వేడుకలను పరిమితంగా నిర్వహించారు. గత నెల సుమత్రాలో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడటంతో సుమారు 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం నేపథ్యంలో రాజధాని జకార్తాలో బాధితుల కోసం ప్రార్థనలు నిర్వహించారు. బాలీలో బాణసంచా ప్రదర్శనలను రద్దు చేసి, వాటి స్థానంలో సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
సిడ్నీలో విషాదఛాయల మధ్య కొత్త ఏడాది
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నూతన సంవత్సర వేడుకలు తీవ్ర విషాదం, కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగాయి. డిసెంబర్ 14, 2025న బాండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో 15 మంది మరణించగా, 40 మంది గాయపడ్డారు. బాధితులకు నివాళిగా అర్ధరాత్రికి గంట ముందు ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ పిల్లర్లపై ప్రత్యేక చిత్రాలను ప్రదర్శించి యూదు సమాజానికి మద్దతు తెలిపారు. ఈ వేడుకల కోసం తొలిసారిగా పోలీసులు అత్యాధునిక రైఫిల్స్‌తో పహారా కాశారు. అయినప్పటికీ వేలాది మంది ప్రజలు హార్బర్ బ్రిడ్జ్ బాణసంచా ప్రదర్శనను చూడటానికి తరలివచ్చారు.
