Site icon HashtagU Telugu

Bomb Blast In Pakistan: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 11 మంది కార్మికులు మృతి?

Bomb Blast In Pakistan

Bomb Blast In Pakistan

Bomb Blast In Pakistan: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి పేలుడు (Bomb Blast In Pakistan) సంభవించింది. బొగ్గు గని కార్మికులు వెళ్తున్న వాహనం లక్ష్యంగా బాంబు పేలుడు జరగడంతో 11 మంది మరణించారు. ఇంతకు ముందు కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని హర్నైలో ఈ పేలుడు సంభవించింది. బొగ్గు గని కార్మికులతో వెళ్తున్న పికప్ వాహనంపై పేలుడు పదార్థంతో దాడి చేశారు. ఈ దాడిలో 11 మంది వెంటనే మరణించారు. 6 మంది గాయపడ్డారు వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు.

రిమోట్‌తో పనిచేసే పరికరంతో పేలుడు జరిపినట్లు తెలుస్తోంద‌ని, ఏ గ్రూపు దాడికి పాల్ప‌డిందో తెలియాల్సి ఉంద‌ని ఓ అధికారి తెలిపారు. బాంబు పేలుడు సంభవించినప్పుడు ట్రక్కులో 17 మంది మైనింగ్ కార్మికులు ప్రయాణిస్తున్నారని ఏరియా డిప్యూటీ కమిషనర్ హజ్రత్ వలీ అగా తెలిపారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక ఆస్పత్రికి చెందిన వైద్యుడు తెలిపారు. ఖనిజ సంపద కలిగిన ఓ ప్రాంతం బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉంది. ఇక్కడ దశాబ్దాలుగా వేర్పాటువాద జాతి బలూచ్ గ్రూపుల తిరుగుబాటు ఉంది. ఈ ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు కూడా చురుకుగా ఉన్నారు.

Also Read: WPL 2025: నేటి నుంచి మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌.. ప్ర‌త్య‌క్ష ప్రసారం ఎక్క‌డంటే?

బలూచిస్థాన్‌లో భద్రతా పరిస్థితి

బలూచిస్థాన్‌లో ఇది మొదటి ఘటన కాదు. ఇటీవలి కాలంలో అక్కడ హింసాత్మక ఘటనలు ఎక్కువయ్యాయి. ఈరోజు కూడా బన్నూలో సెక్యూరిటీ కాన్వాయ్ దగ్గర జరిగిన పేలుడులో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మంగళ్ మేళా ప్రాంతానికి సమీపంలోని డోమెల్ పోలీస్ స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని ఉగ్రవాదులు రోడ్డు పక్కన బాంబులు అమర్చి పేలుడు సంభ‌వించేలా చేశారు. ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అయితే ఇప్పటివరకు ఏ ఉగ్రవాదిని పట్టుకోలేదు.

మరొక సంఘటనలో M-8 హైవేపై ఖోరీ సమీపంలో ఖుజ్దార్ నుండి రావల్పిండికి వెళ్తున్న ప్రయాణీకుల బస్సుపై బాంబు పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక వ్యక్తి మరణించాడు. ఏడుగురు గాయపడ్డారు. జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు పక్కన పార్క్ చేసిన ఆల్టో కారులో పేలుడు పదార్థం ఉండ‌టంతో పేలుడు సంభవించిందని తెలిపారు. పేలుడుకు గల కారణాలేమిటో స్పష్టంగా తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.