Russia Missile Attack : రష్యా క్షిపణి దాడులు ఖండించిన భారత్.. ఐరాసలో వ్యతిరేకంగా ఓటు.. ఎందుకంటే?

ఉక్రెయిన్ నగరాలపై రష్యా క్షిపణి దాడులను భారత్ ఖండించింది.

  • Written By:
  • Updated On - October 11, 2022 / 01:22 PM IST

ఉక్రెయిన్ నగరాలపై రష్యా క్షిపణి దాడులను భారత్ ఖండించింది. ఉక్రెయిన్‌లోని మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం, పౌరుల మరణాలు చోటుచేసుకోవడం పట్ల తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని తెలిపింది. శత్రుత్వాలు పెరగడంపై ఎవరికీ ఆసక్తి లేదని పునరుద్ఘాటించింది. శత్రుత్వాలను తక్షణమే విరమించుకోవాలని .. దౌత్యం, సంభాషణల మార్గానికి అత్యవసరంగా తిరిగి రావాలని కోరింది. ఉక్రెయిన్, రష్యా మధ్య ఘర్షణ వాతావరణాన్ని చల్లార్చేందుకు చేసే అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

రష్యా డిమాండ్‌ను తిరస్కరిస్తూ భారత్‌ ఓటు

ఐరాస సర్వసభ్య సమావేశంలో జరిగిన ఓటింగ్‌లో రష్యా డిమాండ్‌ను తిరస్కరిస్తూ భారత్‌ ఓటు వేసింది. ఉక్రెయిన్‌ లుహాన్స్క్‌, డోనెట్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియా ప్రాంతాల్లోని రష్యాలో విలీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ అల్బానియా తీర్మానం ప్రతిపాదించింది. కంపెనీ రికార్డెడ్ ఓటింగ్ నిర్వహించాలని కోరింది. కానీ రష్యా మాత్రం ఈ తీర్మానంపై రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ చేపట్టాలని డిమాండ్ చేసింది. కానీ, మాస్కో డిమాండ్‌పై ఓటింగ్‌ నిర్వహించగా 107 దేశాలు తిరస్కరించబడ్డాయి. వీటిలో భారత్ కూడా ఉంది. రికార్డెడ్ బ్యాలెట్‌కు అనుకూలంగా న్యూదిల్లీ ఓటు వేసింది. కేవలం 13 దేశాలు మాత్రమే రష్యాకు అనుకూలంగా మద్దతు తెలిపాయి. మరో 39 దేశాలు ఓటింగ్‌కు దూరమయ్యాయి. వీటిలో రష్యా, చైనా కూడా ఉన్నాయి. మరోవైపు అల్బానియా తీర్మానాన్ని స్వీకరించే ఐరాస సర్వసభ్య సమావేశం(యూఎన్జీఏ) పునఃపరిశీలించాలని రష్యా కోరింది. కానీ, యూఎన్‌జీఏ మాత్రం తీర్మానాన్ని స్వీకరించకూడదని నిర్ణయించింది. భారత్ సహా మొత్తం 104 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా.. 16 దేశాలు వ్యతిరేకించాయి. మరో 34 దేశాలు గైర్హాజరయ్యాయి.

ఉక్రెయిన్ కు అధునాతన వాయు రక్షణ వ్యవస్థలిస్తాం : అమెరికా

ఇక ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ.. ఉక్రెయిన్ నగరాలపై రష్యా క్షిపణి దాడులను ఖండించారు. రష్యా ముప్పును ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ కు అధునాతన వాయు రక్షణ వ్యవస్థలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ దాడులు వ్లాదిమిర్ పుతిన్ యొక్క “చట్టవిరుద్ధమైన యుద్ధం” యొక్క “క్రూరత్వాన్ని” చూపించాయని
బైడెన్ వ్యాఖ్యానించారు.

జర్మనీ సైతం..

రష్యా క్షిపణి దాడులను జర్మనీ ఖండించింది. నాలుగు IRIS-T SLM ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లలో మొదటిదాన్ని ఉక్రెయిన్‌కు పంపుతామని ప్రకటించింది.

ఉక్రేనియన్ మిలిటరీ ప్రకారం.. రష్యా సోమవారం నాడు 84 క్రూయిజ్ క్షిపణులను ఉక్రెయిన్ పైకి ప్రయోగించింది. ఈ దాడుల్లో అనేకమంది గాయపడగా, కనీసం 14 మంది మరణించారు.రష్యా, క్రిమియాలను కలిపే కీలకమైన వంతెనపై ట్రక్కు పేలుడు అనంతరం ప్రతీకార చర్యగా రష్యా ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది.