Palestine : ఆ దేశంలో ప్రజలందరూ ఉగ్రవాదులేనా?

ఇజ్రాయిల్ (Israel) పై దాడి చేసిన దుర్మార్గానికి పాలస్తీనా (Palestine) మొత్తం బాధ్యత వహించాలని ఆయన అంటున్నారు.

  • Written By:
  • Updated On - October 14, 2023 / 03:09 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Palestine : పాలస్తీనాలోని గాజా ప్రాంతం గజగజ వణికి పోతోంది. అక్టోబర్ 7వ తేదీన గాజాను పాలిస్తున్న హమాస్ తీవ్రవాద దళాలు ఇజ్రాయిల్ మీద దాడి చేసి వందలాది మందిని బలి తీసుకున్న ఘటన తర్వాత, ఇజ్రాయిల్ రెచ్చిపోయింది. గాజా ప్రాంతం మొత్తాన్ని దిగ్బంధం చేసింది. బాంబుల వర్షం కురిపించింది. రోజు రోజుకూ వందల మంది హతులవుతున్నారు. వేల మంది క్షతగాత్రులవుతున్నారు. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని అక్కడ నుంచి పారిపోతున్నారు. గాజా ఉత్తర ప్రాంతంలో ఉంటున్న 11 లక్షల మంది ప్రజలు మొత్తం ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ అల్టిమేట్ జారీ చేసిన దగ్గర నుంచి అక్కడంతా అల్లకల్లోలమే. ఈ నాలుగు రోజుల్లోనే దాదాపు నాలుగు లక్షల పైచిలుకు గాజా ప్రజలు ఉత్తర ప్రాంతం నుంచి ఏ సాధనం దొరికితే అది పట్టుకొని దక్షిణ ప్రాంతం వైపు పారిపోయారు. మొత్తం ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ హుంకరిస్తోంది. హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ వైపు పశ్చిమ దేశాలు, ఇతర ప్రపంచ దేశాలు కూడా సానుభూతి చూపించాయి. హమాస్ అమానుష దాడిని తీవ్రంగా ఖండించాయి. అయితే హమాస్ చేసిన దాడికి వందల రెట్లు అధికంగా ఇప్పుడు ఇజ్రాయిల్ గాజా ప్రజల మీద నిరంతర రక్తపాత దురాక్రమణ సాగిస్తూ ప్రపంచం నుంచి నిరసన ఎదుర్కొంటోంది.

We’re now on WhatsApp. Click to Join.

గాజా మొత్తం ప్రజలు 23 లక్షలయితే ఉత్తర ప్రాంతంలో 11 లక్షల మంది ఉంటున్నారు. వారందరూ ఖాళీ చేసి దక్షిణ ప్రాంతం వైపు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే బాంబు దాడి చేస్తూ జలవాయు భూమార్గాల నుంచి గాజాను దిగ్బంధం చేస్తూ ఇజ్రాయిల్ భీతావాహ పరిస్థితులు సృష్టించింది. దానికి తోడు ఇజ్రాయిల్ చేతిలో ఉన్న కరెంట్, ఆహార సరఫరాను నిలిపివేసింది. వార్తలు చదువుతుంటేనే గుండె ఆగిపోయేంత పని అవుతుంది. అసలే గాజా ప్రాంతం ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతంగా భావిస్తారు. అలాంటి 40 కిలోమీటర్ల చిన్న పీలికలాంటి ప్రాంతంలో ఉత్తరాది నుంచి దక్షిణాదికి వెళ్లడం అంటే ఏ బాంబులు అవసరం లేకుండానే ప్రజలు క్రిక్కిరిసిపోయి అన్న పానీయాలు లేకుండా అత్యంత దయనీయంగా మృత్యువాత పడతారు. ఇలాంటి పరిస్థితుల్లో మొదట్లో ఇజ్రాయిల్ కు మద్దతుగా హమాస్ ను తీవ్రంగా హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి కూడా ఇప్పుడు ఇజ్రాయిల్ ని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తోంది. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనీయో గుటెరెస్ కూడా గాజాలో నెలకొన్న తాజా పరిస్థితిపై స్పందించి అక్కడ ప్రజల దయనీయ స్థితి పట్ల సానుభూతిని వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ను హెచ్చరించారు కూడా.

పరిస్థితి ఇలా ఉంటే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇది ప్రారంభమేనని, పాలస్తీనా (Palestine)వాసులు ఘోర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని బహిరంగంగానే ప్రకటన చేశారు. అంతేకాదు ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ గాజాలో అమాయకులైన పౌరులు ఎవరూ లేరని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రకటించడం ఇజ్రాయిల్ పాలకుల నియంతృత్వ మనస్తత్వాన్ని తెలియజేస్తోంది. ఇజ్రాయిల్ పై దాడి చేసిన దుర్మార్గానికి పాలస్తీనా (Palestine) మొత్తం బాధ్యత వహించాలని ఆయన అంటున్నారు. అక్కడ ప్రజలు అమాయకులంటే తాము నమ్మమని, తమను పాలిస్తున్న దుష్టశక్తులకు వ్యతిరేకంగా ఆ ప్రజలు తిరుగుబాటు చేయాల్సిందని, అలా చేయలేదు కాబట్టి వాళ్లంతా తమ పాలకులు చేస్తున్న అకృత్యాలకు బాధ్యత వహించవలసిందేనని ఇజ్రాయిల్ అధ్యక్షుని ఉవాచ. గాజాను పరిపాలిస్తున్నది ఒక ఉగ్రవాద సంస్థ అని అమెరికా, యూరోపియన్ యూనియన్, జర్మనీ తదితర దేశాలు ఎప్పుడో అంగీకరించాయని, గాజాను సర్వనాశనం చేసి తీరుతామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కఠోరంగా చెప్పారు.

Also Read:  CBN : మియాపూర్ స్టేష‌న్ వ‌ద్ద ఉద్రిక్త‌త .. “లెట్స్ మెట్రో ఫ‌ర్ సీబీఎన్” కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చిన బాబు అభిమానులు

పారిపోవడానికి ఏ దారీ లేని ప్రాంతంలో గాజా ప్రజలు ఇరుక్కుపోయారు. ఇలాంటి సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉగ్రవాదులే అని చెప్పడం ఎంతవరకు సబబు అనేది ప్రపంచ దేశాలు ఇప్పుడు తర్జనభర్జన పడుతున్నాయి. ఒక దేశంలోని ఉగ్రవాద సంస్థలు చేసే దుశ్చర్యలకు ఆ దేశంలో సామాన్య పౌరులంతా బాధ్యత వహించాలని చెప్పడం అతి ప్రమాదకరమైన చారిత్రక పరిణామంగా గుర్తించాల్సి వస్తుంది. ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని నెతిన్యాహు సొంత దేశంలోనే ఎంతో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అక్కడ ప్రజలు బహిరంగంగానే నెతన్యాహు పాలనను విధానాలను తీవ్రంగా నిరసిస్తున్నారు. అతని నియంతృత్వ పాలన కారణంగా పాలస్తీనా (Palestine) ప్రజలు మరో దారి లేక ఉగ్రవాదులుగా మారుతున్నారని, అది తమ దేశానికి కూడా హాని చేస్తుందని నెతన్యాహు విధానాల పరిణామమే తాజాగా హమాస్ దాడి అని, ఇజ్రాయిల్ లోని ప్రజలే మేధావులు, పాత్రికేయులు విమర్శిస్తున్నారు.

ఇజ్రాయిల్ లోని అతిపెద్ద వార్త సంస్థ హారెట్జ్ కాలమిస్టు అంతర్జాతీయ గుర్తింపు ఉన్న జర్నలిస్టు జిడియోన్ లెవీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇజ్రాయిల్ ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. గాజా మీద ఇప్పటివరకు ఇజ్రాయిల్ చేసిన అన్ని యుద్ధ నేరాలలో కల్లా అతిపెద్ద యుద్ధ నేరమని అభివర్ణించారు. ఈ పరిణామాలకు ఇజ్రాయిల్ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, అతిపెద్ద యుద్ధం అంచున ఇజ్రాయిల్ ఇప్పుడు కూర్చుందని ఆయన అన్నారు. ఈ మొత్తం దుస్థితికి బెంజిమెన్ నెతన్యాహు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇలా ఇజ్రాయిల్ లో ఆ దేశం ప్రజలు మేధావులు ఇజ్రాయిల్ పాలకుల యుద్ధనీతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ యుద్ధ పరిణామాలు తమ దేశానికి కూడా ప్రాణాంతకంగా మారుతాయని వారు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయిల్ ఇప్పటికైనా ఆలోచించి వెనక్కి తగ్గకపోతే ప్రపంచం మరొక భయంకర యుద్ధానికి సిద్ధం కావలసి ఉంటుంది. జరుగుతున్న తాజా పరిణామాలు చేస్తున్న హెచ్చరిక ఇదే.

Also Read:  CM KCR: తెలంగాణ ప్రజలందరి బతుకుల్లో బతుకమ్మ వెలుగులు నింపాలి: కేసీఆర్