Site icon HashtagU Telugu

Iphone : 2026లో యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్..!

Foldable Iphone

Foldable Iphone

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించేందుకు టెక్ దిగ్గజం యాపిల్ సిద్ధమవుతోంది. 2026 చివరి నాటికి తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. ఈ పరిణామం ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్‌ను పూర్తిగా మార్చేయడమే కాకుండా, వినియోగదారుల అంచనాలను కొత్త స్థాయికి తీసుకెళ్తుందని టెక్నాలజీ రీసెర్చ్ సంస్థ ‘కౌంటర్‌పాయింట్’ తన తాజా నివేదికలో పేర్కొంది. యాపిల్ రాకతో ఫోల్డబుల్ ఫోన్లు ఒక ప్రత్యేక సెగ్మెంట్‌ నుంచి మెయిన్‌స్ట్రీమ్‌గా మారే అవకాశం ఉందని విశ్లేషించింది.

కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, యాపిల్ వంటి పెద్ద బ్రాండ్ ఫోల్డబుల్ రంగంలోకి ప్రవేశిస్తే, ఈ ఫోన్లపై వినియోగదారుల్లో అవగాహన ఒక్కసారిగా పెరుగుతుంది. ముఖ్యంగా హై-ఎండ్ సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్లను మార్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది. యాపిల్ తనకున్న ఎకోసిస్టమ్ బలంతో మార్కెట్ డైనమిక్స్‌ను సమూలంగా మార్చే శక్తి ఉందని, ఇది మొత్తం అమ్మకాలను పెంచుతుందని తెలిపింది.

ప్రస్తుత మార్కెట్ పరిస్థితి
గత కొన్నేళ్ల ప్రయోగాల తర్వాత, ప్రస్తుతం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ స్థిరమైన వృద్ధి దశలోకి ప్రవేశించింది. ముఖ్యంగా అమెరికా మార్కెట్‌లో 2025లో ఈ విభాగం 68 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని నివేదిక అంచనా వేసింది. మెరుగైన డిజైన్లు, ఫోన్ల మన్నిక పెరగడం, పలు బ్రాండ్లు విభిన్నమైన మోడళ్లను తీసుకురావడం ఈ వృద్ధికి కారణమవుతున్నాయి.

ప్రస్తుతం ఈ మార్కెట్‌లో శాంసంగ్ తన గెలాక్సీ Z ఫోల్డ్, ఫ్లిప్ సిరీస్‌లతో ఆధిపత్యం చెలాయిస్తోంది. తాజాగా FE వేరియంట్‌ను కూడా పరిచయం చేసి, తక్కువ ధరలో ఫోల్డబుల్స్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ ఏడాది చివరిలోగా మూడుసార్లు మడిచే (ట్రై-ఫోల్డ్) డివైజ్‌ను కూడా ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది.

మరోవైపు మోటరోలా తన రేజర్ సిరీస్‌తో వేగంగా మార్కెట్ వాటాను పెంచుకుంటూ శాంసంగ్‌కు గట్టిపోటీనిస్తోంది. 2025 అక్టోబర్ లో విడుదలైన గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్, తనదైన ఏఐ ఫీచర్లతో శాంసంగ్, మోటరోలాకు మధ్య తన స్థానాన్ని పదిలపరుచుకునే ప్రయత్నం చేస్తోంది.

ఈ అంశంపై కౌంటర్‌ పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ లిజ్ లీ మాట్లాడుతూ.. “2025లో శాంసంగ్ తన అనుభవంతో, ఎకోసిస్టమ్ బలంతో మార్కెట్‌లో ముందుంది. అయితే, మోటరోలా వేగంగా విస్తరించడం, గూగుల్ ఏఐ ఆధారిత ఫీచర్లతో పోటీని తీవ్రతరం చేస్తున్నాయి. 2026లో యాపిల్ అడుగుపెడితే, ఈ మార్కెట్ మరింత విస్తరించడమే కాకుండా, ఫోల్డబుల్స్ ఒక ప్రధాన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఫార్మాట్‌గా స్థిరపడతాయి” అని వివరించారు.

Exit mobile version