Shootout in Chinese New Year: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 10మంది మృతి!

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. కాల్పుల మోతకు పేరుగాంచిన అమెరికాలో మరోసారి నరమేధం జరిగింది.

  • Written By:
  • Publish Date - January 22, 2023 / 09:14 PM IST

Shootout in Chinese New Year: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. కాల్పుల మోతకు పేరుగాంచిన అమెరికాలో మరోసారి నరమేధం జరిగింది. చైనీయుల న్యూఇయర్ వేడుకల పార్టీలో ఓ దుండగుడు తుపాకీతో విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో మరోసారి రక్తం చిందింది. అమెరికాలోని క్యాలిఫోర్నియాలో జరిగిన కాల్పుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారని, పదహారు మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.

క్యాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్ లో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు వేల సంఖ్యలో జనాలు వచ్చారు. అయితే అక్కడికి వచ్చిన ఓ ఉన్మాది తన చేతిలో ఉన్న తుపాకీతో కనిపించిన వాళ్ల మీద కాల్పులు జరిపాడు. స్థానికుల సమాచారం ప్రకారం రాత్రి గం.10లకు ఈ ఘటన జరిగింది. ఇందులో 10 మంది మరణించినట్లు, 16 మందికి గాయాలు అయినట్లు అధికారులు చెబుతున్నారు.

మాంటెరీ పార్క్ లో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు జరుగుతుండగా.. అక్కడి డ్యాన్స్ క్లబ్ ని టార్గెట్ గా చేసుకొడి ఉన్మాది కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. మాంటెరీ పార్క్ లో ఎక్కువగా ఆసియా దేశాలకు చెందిన వారు నివసిస్తుండగా.. చైనీయుల కొత్త సంవత్సరం సందర్భంగా రెండు రోజులుగా వేడుకలు జరుగుతున్నాయి. రెండోరోజు ఈ ఘాతుకం జరిగింది.

కాగా మాంటెరీ పార్క్ లాస్ ఏంజిల్స్ కు 11కిలోమీటర్ల దూరంలో ఉంది. కాల్పులకు సంబంధించిన సమాచారం తమకు రాత్రి గం.10.20ని.లకు వచ్చిందని, వెంటనే అప్రమత్తమైనట్లు పోలీసులు వివరించారు. కాగా డ్యాన్స్ క్లబ్ లో నుండి క్షతగాత్రులను స్ట్రెచర్ల మీద తీసుకువస్తున్న క్లిప్పింగ్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికాలో గత ఏడాది దేశవ్యాప్తంగా 647 కాల్పుల కేసులు నమోదయ్యాయి.