బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. మరో హిందూ యువకుడిపై మూకదాడి, మృతి!

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఈ ఘటనలపై విచారణకు ఆదేశించింది. "కొత్త బంగ్లాదేశ్‌లో ఇటువంటి హింసాత్మక చర్యలకు చోటు లేదు. నేరస్థులను వదిలిపెట్టం" అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Published By: HashtagU Telugu Desk
Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో అల్పసంఖ్యాక వర్గాలైన హిందువులపై దాడుల పర్వం కొనసాగుతోంది. మైమెన్‌సింగ్‌లో దీపూ చంద్ర దాస్ అనే యువకుడిని సజీవ దహనం చేసిన ఘటన మరువకముందే తాజాగా రాజ్‌బరి జిల్లాలో అమృత్ మండల్ (30) అనే మరో హిందూ యువకుడు మూక దాడికి బలయ్యాడు.

ఘటన వివరాలు

స్థానిక నివేదికల ప్రకారం.. మంగళవారం రాత్రి రాజ్‌బరి జిల్లాలోని పాంగ్‌షా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. అమృత్ మండల్ తన అనుచరులతో కలిసి స్థానిక నివాసి షాహిదుల్ ఇస్లాం ఇంటికి దోపిడీ కోసం వెళ్లాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో ఇంటి సభ్యులు ‘దొంగ-దొంగ’ అని కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా చుట్టుముట్టారు. అమృత్ సహచరులు పారిపోగా, అల్లరిమూకలు అమృత్‌ను పట్టుకుని విచక్షణారహితంగా కొట్టి చంపారు.

Also Read: ఊడిపోయిన జుట్టును అమ్ముతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

పోలీసుల వాదన, అరెస్టులు

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే అమృత్ పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలించే లోపే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అమృత్ మండల్ గతంలో హత్య కేసుల్లో నిందితుడని, అతను భారత్‌లో కొంతకాలం తలదాచుకుని ఇటీవల బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సెలిమ్ అనే వ్యక్తిని తుపాకులతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హిందూ వర్గాల్లో ఆందోళన

అమృత్ మండల్‌పై క్రిమినల్ ఆరోపణలు ఉన్నప్పటికీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మూక దాడులకు పాల్పడటంపై హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత వారం మైమెన్‌సింగ్‌లో దీపూ చంద్ర దాస్‌ను ఈశ్వర నింద ఆరోపణలతో అల్లరిమూకలు కొట్టి చంపి, చెట్టుకు కట్టేసి తగలబెట్టారు. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ దాడులను ఖండిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో హిందువులకు రక్షణ కరువైందని బాధితులు వాపోతున్నారు.

ప్రభుత్వ స్పందన

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఈ ఘటనలపై విచారణకు ఆదేశించింది. “కొత్త బంగ్లాదేశ్‌లో ఇటువంటి హింసాత్మక చర్యలకు చోటు లేదు. నేరస్థులను వదిలిపెట్టం” అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన రాజకీయ అస్థిరతను అడ్డం పెట్టుకుని మైనార్టీలే లక్ష్యంగా దాడులు పెరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

  Last Updated: 25 Dec 2025, 09:19 PM IST