China vs Taiwan : తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయాన్నే ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాల ఎదుట జనం బారులు తీరారు. దేశంలోని 18,000 పోలింగ్ స్టేషన్‌లలో దాదాపు 2 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో దాదాపు 75 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పోటీ ఇద్దరు అభ్యర్థుల మధ్య నెలకొంది. వీరిలో ఒకరు చైనా వ్యతిరేక, వేర్పాటువాద నేత లై చింగ్-తే. ఇప్పటివరకు ఈయన తైవాన్ ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు. ఈసారి అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. తైవాన్ ప్రజాస్వామిక ప్రమాణాల కోసం సరైన మార్గాన్ని ఎంచుకోవాలని తైవాన్ ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. ఆయనే ముందంజలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఇక తైవాన్ మాజీ పోలీసు చీఫ్, మేయర్ హౌ యు-ఇహ్ కూడా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నారు. ఈయన చైనాకు అనుకూలంగా ఉన్నారు. చైనా అనుకూల పార్టీ కౌమింటాంగ్ తరఫున హౌ యు-ఇహ్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అధ్యక్ష అభ్యర్థి హౌ యు-ఇహ్ .. కౌమింటాంగ్ పార్టీ నేత. అధ్యక్ష అభ్యర్థి లై చింగ్-తే.. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నేత. తైవాన్ పీపుల్స్ పార్టీ నుంచి కో వెన్-జే అనే అభ్యర్థి కూడా రంగంలో ఉన్నారు. ఇవాళ జరిగే పోలింగ్‌తో దేశ అధ్యక్షుడిని.. 113 అసెంబ్లీ స్థానాలకు ప్రజాప్రతినిధులను ఓటర్లు(China vs Taiwan) ఎన్నుకోనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇవాళ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో తైవాన్ గగనతలంలోకి గత 24 గంటల్లో రెండు చైనా బెలూన్లు ప్రవేశించాయి. ఈవిషయాన్ని తైవాన్ రక్షణ శాఖ ధ్రువీకరించింది. దీంతో కొంత కలకలం రేగింది. తైవాన్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఇలా చేసిందని వ్యాఖ్యానించింది. తైవాన్ తమ దేశంలో భాగమని చైనా ఆది నుంచే వాదిస్తోంది. తప్పుడు నాయకుడిని ఎన్నుకోవడం తైవాన్‌లో యుద్ధానికి వేదికను సిద్ధం చేస్తుందని ఎన్నికలకు ముందు చైనా పలుమార్లు వార్నింగ్స్ ఇచ్చింది. ఈనేపథ్యంలో ఇవాళ జరుగుతున్న పోలింగ్‌లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. చైనా నుంచి 180 కిలోమీటర్ల దూరంలో.. ఒక జలసంధి ద్వారా వేరు చేయబడి తైవాన్ ఉంటుంది. దీన్ని తమ దేశంలో విలీనం చేసుకుంటామని ఇటీవల చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ప్రకటించారు. 2027 నాటికి సైనిక చర్య ద్వారా చైనాలో తైవాన్ విలీనం పూర్తవుతుందని అంటున్నారు.