2023లోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వ్‌దేవ్ తన దైన శైలిలో పలు విషయాలను తెలిపారు. అంతర్జాతీయ పరిణామాలపై ఆయన స్పందించారు. కొత్త సంవత్సరంలో అందరూ ముందుకు సాగుతారని, 2023లో కొన్ని పరిణామాలు జరిగే అవకాశం ఉందని ఆయన ట్విట్టర్ లో తెలిపారు.
ప్రస్తుతం అందరూ ఎక్కువగా వినియోగించే ఇంధనం ధర బ్యారెల్ కు 150 డాలర్లు పెరుగుతుందని, గ్యాస్ ధర వెయ్యి క్యూబిక్ మీటర్లకు 5 వేల డాటర్లకు చేరుకుంటుందని తెలిపారు. బ్రిటన్ దేశం మళ్లీ యూరోపియన్ యూనియన్ లోకి రానున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఈయూ కూలిపోయి అందరికీ యూరో కరెన్సీనే అందుబాటులోకి వస్తుందన్నారు.
పోలాండ్, హంగేరీలు గతంలో ఉన్న ఉక్రెయిన్ వెస్ట్ ప్రాంతాలను ఆక్రమించే అవకాశం ఉందని తెలిపారు. జర్మనీ భూభాగం, పోలాండ్, బాల్టిక్ రాష్ట్రాలు, చెక్ రిపబ్లిక్, స్లొవేకియా, ఇతర ప్రాంతాలతో కలిపి నాల్గొవ జర్మనీ అయిన ఫోర్త్ రీచ్ ఏర్పడే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ఆ తర్వాత ఫ్రాన్స్‌కు, పోర్త్ రీచ్‌కు మధ్య యుద్ధం జరగొచ్చని అన్నారు. ఈ పరిణామాల వల్ల ఐరోపా విభజించబడే అవకాశం ఉందని, పోలాండ్ కూడా విభజనకు గురవుతుందని తెలిపారు.
నార్త్ ఐర్లాండ్ బ్రిటన్ నుండి విడిపోతుందని, అనంతరం అది రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌లో చేరే అవకాశం ఉందని, అమెరికాలో అంతర్యుద్ధం ప్రారంభం అవుతుందని అన్నారు. టెక్సాస్, కాలిఫోర్నియాలు స్వతంత్ర ప్రాంతాలుగా ఆవిర్భవించి మెక్సికో, టెక్సాస్ ప్రాంతాలు మిత్రరాజ్యంగా ఏర్పడే అవకాశం ఉంటాయని తెలిపారు. అంతర్యుద్ధం ముగిసిన తర్వాత జరిగే ఎన్నికల్లో ఎలాన్ మస్క్ చాలా రాష్ట్రాల్లో విజయం సాధించి ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. స్టాక్ మార్కెట్లు కూడా అమెరికాను, ఐరోపాను వీడిపోతాయని, అవి ఆసియా దేశాలకు వెళ్తాయని తెలిపారు. యూరో, డాలర్ల వాడకం చాలా వరకూ తగ్గిపోతుందని అంచనా వేశారు.