ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగిన అమెరికా..ఎందుకంటే..?

డబ్ల్యూహెచ్ఓ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ సంస్థ నుంచి అధికారికంగా వైదొలుగుతున్నట్లు అమెరికా ప్రకటించింది. కరోనా వ్యాప్తి ప్రారంభ దశలో సరైన సమాచారం ఇవ్వకపోవడం అవసరమైన సంస్కరణలను అమలు చేయడంలో అలసత్వం చూపడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అమెరికా ఆరోపిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
America withdrew from the World Health Organization..why..?

America withdrew from the World Health Organization..why..?

. కరోనా నిర్వహణపై అసంతృప్తి

. నిధుల నిలిపివేత.. సిబ్బంది వెనక్కి పిలుపు

. బకాయిల వివాదం..భవిష్యత్ ప్రభావాలు

World Health Organization: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన వేళ దానిని సమర్థంగా నియంత్రించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విఫలమైందన్న ఆరోపణలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. డబ్ల్యూహెచ్ఓ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ సంస్థ నుంచి అధికారికంగా వైదొలుగుతున్నట్లు అమెరికా ప్రకటించింది. కరోనా వ్యాప్తి ప్రారంభ దశలో సరైన సమాచారం ఇవ్వకపోవడం  అవసరమైన సంస్కరణలను అమలు చేయడంలో అలసత్వం చూపడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అమెరికా ఆరోపిస్తోంది. ఈ మేరకు అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ ఆరోగ్య భద్రతకు సంబంధించి డబ్ల్యూహెచ్ఓ పాత్ర బలహీనపడిందని  భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కొనే సామర్థ్యం ఆ సంస్థకు లేదని అమెరికా అభిప్రాయపడింది. అందుకే ఇకపై ఆ సంస్థతో తమ సంబంధాలను కొనసాగించలేమని స్పష్టం చేసింది.

డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగడమే కాకుండా, ఆ సంస్థకు అమెరికా నుంచి వెళ్లే అన్ని రకాల ఆర్థిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూహెచ్ఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న అమెరికా సిబ్బందిని కూడా స్వదేశానికి వెనక్కి పిలిపించినట్లు తెలిపింది. అలాగే డబ్ల్యూహెచ్ఓకు అనుబంధంగా పనిచేస్తున్న సాంకేతిక కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే, ప్రపంచ ఆరోగ్య సమస్యలు పూర్తిగా విస్మరించబోవడం లేదని అమెరికా స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో లేదా పరిమిత పరిధిలో అవసరమైతే డబ్ల్యూహెచ్ఓతో కలిసి పని చేసే అవకాశం ఉంటుందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఈ సంస్థపై విమర్శలు గట్టిగా వినిపిస్తూ వచ్చాయి. పలుమార్లు వైదొలుగుతామని హెచ్చరించిన అమెరికా ఇప్పుడు ఆ మాటను కార్యరూపం దాల్చించింది.

డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలుగుతున్న సమయంలో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. అమెరికా ఆ సంస్థకు భారీ మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉందని నివేదికలు వెల్లడించాయి. బ్లూమ్‌బర్గ్ సమాచారం ప్రకారం, అమెరికా డబ్ల్యూహెచ్ఓకు సుమారు 260 మిలియన్ డాలర్లు బకాయి ఉంది. ఇది భారతీయ కరెన్సీలో దాదాపు రూ.2,382 కోట్లకు సమానం. ఈ బకాయిలు పూర్తిగా చెల్లించేవరకు అమెరికా ఉపసంహరణ ప్రక్రియ పూర్తికాదని డబ్ల్యూహెచ్ఓ అధికారులు పేర్కొన్నారు. అయితే సంస్థ నుంచి బయటపడేందుకు ముందు బకాయిలు చెల్లించాల్సిందే అనే నిబంధన ఏమీ లేదని అమెరికా అధికారులు వాదిస్తున్నారు. ఈ అంశంపై రెండు పక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. అమెరికా నిర్ణయం ప్రపంచ ఆరోగ్య రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఒక వైపు డబ్ల్యూహెచ్ఓకి ఆర్థిక లోటు పెరిగే అవకాశం ఉండగా మరోవైపు ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో కొత్త మార్పులకు ఇది దారితీయవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 

  Last Updated: 23 Jan 2026, 09:57 PM IST