America Warships : ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి అమెరికా కూడా రంగ ప్రవేశం చేసింది. ఇజ్రాయెల్‌కు యుద్ధంలో సాయం చేసేందుకు యుద్ధనౌకలను, యుద్ధవిమానాలను పంపించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలను అందించాలని చెప్పారు. విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్’ తో పాటు పలు యుద్ధనౌకలను తూర్పు మధ్యధరా తీరానికి పంపుతున్నట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్‌లో మాట్లాడారు. అమెరికా యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు త్వరలోనే ఇజ్రాయెల్‌కు చేరుకుంటాయని నెతన్యాహుకు బైడెన్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న పరిస్థితులను అదునుగా తీసుకొని ఇతర సంస్థలు ప్రయోజనం పొందాలని చూడొద్దని, అది విపరీత పరిణామాలకు దారితీస్తుందని బైడెన్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join
ఇజ్రాయెల్‌పై శనివారం రోజు హమాస్ జరిగిన రాకెట్ దాడుల్లో అమెరికన్ పౌరులు కూడా చనిపోయారని ఆదివారం రోజే అమెరికా సర్కారు ధ్రువీకరించింది. బాధితులకు, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపింది. దాడుల్లో మరణించిన, కనిపించకుండా పోయిన అమెరికా పౌరుల జాబితాను ధ్రువీకరించడానికి ప్రయత్నిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఇజ్రాయెల్‌కు సాయంగా యుద్దనౌకలను పంపించడం ద్వారా పాలస్తీనాపై జరుగుతున్న దురాక్రమణకు అమెరికా సహకరిస్తోందని హమాస్ ఆరోపిస్తోంది.ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య జరుగుతున్న దాడుల కారణంగా ఇప్పటికే ఇజ్రాయెల్ లో 1100 మంది చనిపోగా (America Warships), గాజాలో 600 మంది చనిపోయారు.