Site icon HashtagU Telugu

Indian Refineries : అమెరికా ఎఫెక్ట్? ..రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు నిలిపివేసిన భారత్.!

Indian Refineries

Indian Refineries

రష్యా చమురు దిగుమతులపై అమెరికా ఇటీవల ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో మాస్కో కంపెనీలకు భారత రిఫైనరీలు కొత్త ఆర్డర్లు నిలిపివేశాయి. స్పాట్ మార్కెట్ల నుంచి కొనుగోళ్లు చేస్తూ, ఆంక్షలపై స్పష్టత కోసం భారత కంపెనీలు వేచిచూస్తున్నాయి. అమెరికా హెచ్చరికలతో రష్యా సంస్థల నుంచి దిగుమతులు ఆగిపోవడంతో, పశ్చిమాసియా వైపు ఇవి దృష్టి సారించాయి. అయితే, అమెరికాకు సహకరిస్తామని హామీతో, అక్కడి సంస్థల నుంచి బుకింగ్స్ పెంచుకున్నట్టు అధికార వర్గాల సమాచారం.

ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం విషయంలో వ్లాదిమిర్ పుతిన్ వైఖరితో విసిగిపోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఐరోపా సమాఖ్య దేశాలు ఇటీవలే రష్యా ఆయిల్‌ రిఫైనరీలపై ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను భారత రిఫైనరీలు నిలిపివేశారు. కొత్త ఆర్డర్లు ఆపేసిన భారత కంపెనీలు, ఆంక్షలకు సంబంధించి మరింత స్పష్టత కోసం వేచిచూసే ధోరణి అనుసరిస్తున్నాయి. ఆ లోటును భర్తీ చేసుకోడానికి స్పాట్‌ మార్కెట్ల నుంచి కొనుగోళ్లు చేస్తున్నాయి. ఈ విషయాన్ని చమురు సంస్థలకు చెందిన కీలక అధికారులు చెప్పినట్టు ఎకనమిక్‌ టైమ్స్‌ మంగళవారం ఓ కథనం ప్రచురించింది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ తనకు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై మాటిచ్చారని ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే.

రష్యా చమురు సంస్థలు రాస్‌నెఫ్ట్, లుకాయిల్‌, వాటి అనుబంధ కంపెనీల నుంచి చమురు కొనుగోళ్లపై అక్టోబరు 22న అమెరికా నిషేధం విధించింది. అమెరికాతో పాటు అమెరికాయేతర సంస్థలు ఆయిల్ దిగుమతి చేసుకున్నా జరిమానా తప్పదని ట్రంప్ హెచ్చరించారు. రష్యా ఆయిల్ కంపెనీలతో లావాదేవీలను నెల రోజుల్లోగా అంటే నవంబర్‌ 21 నాటికి ముగించాలని తేల్చిచెప్పారు. ప్రస్తుతం భారత్ క్రూడాయిల్ దిగుమతుల్లో మూడో వంతు రష్యా నుంచే సరఫరా అవుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రోజుకు సగటున 1.7 మిలియన్‌ బ్యారెళ్ల (ఎంపీడీ) ఆయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 1.2 మిలియన్ బ్యారెళ్లు ఈ రెండు సంస్థల నుంచే కొనుగోలు చేయడం గమనార్హం.

వీటిలో ఎక్కువ మొత్తం రిలయన్స్, నయారా వంటి ప్రైవేటు చమురు కంపెనీలే కొనుగోలు చేశాయి. అమెరికా, ఐరోపా సమాఖ్య దేశాల ఆంక్షల నేపథ్యంలో క్రూడాయిల్ దిగుమతి కోసం భారత రిఫైనరీలు పశ్చిమాసియా వైపు దృష్టిసారించినట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఇప్పటికే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్పందించింది. ముడి చమురు దిగుమతులపై ఐరోపా సమాఖ్య నిబంధనలకు అనుగుణంగా ముందుకెళ్తామని తెలిపింది. అమెరికా, యూకే, ఐరోపా సమాఖ్య విధించిన ఆంక్షల ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని స్పష్టం చేసింది. ఆంక్షల అమలు, నియంత్రణ చట్టాలకు లోబడి ఉంటామని వివరించింది.

ఇదిలా ఉండగా వాణిజ్య, ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం అగ్రరాజ్యానికి సహకరిస్తామని ఇచ్చిన హామీ మేరకు అమెరికా చమురు సంస్థల నుంచి భారత రిఫైనరీలు క్రూడాయిల్ బుకింగ్ పెంచుకున్నాయి. రష్యా నుంచి ఆయిల్ దిగుమతు చేసుకుంటున్నారనే కారణంతో భారత్‌పై అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను పెంచిన విషయం తెలిసిందే. తొలుత 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్.. తర్వాత మరో 25 శాతం కలిపి మొత్తం 50 శాతం టారీఫ్‌లు విధించారు. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి నిలిపివేసత్ామని తమకు భారత ప్రధాని మోదీ మాటిచ్చారని ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే.

Exit mobile version