Israel Vs Lebanon : లెబనాన్ దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. సోమవారం ఒక్కరోజే దక్షిణ లెబనాన్‌లోని 1100 లక్ష్యాలపై ఇజ్రాయెల్ ఆర్మీ మిస్సైళ్లు, బాంబులు, డ్రోన్లతో విరుచుకుపడింది. సైదా, మరజుయాన్, టైర్, జహరాని సహా పలు జిల్లాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 490 మందికిపైగా లెబనాన్ పౌరులు చనిపోయారు. 2006 సంవత్సరం తర్వాత లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఇంత భీకర దాడులు చేయడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా హిజ్బుల్లా 200కుపైగా రాకెట్లను ప్రయోగించింది. దీంతో ఇరుదేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈనేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఒక కీలక సందేశాన్ని విడుదల చేశారు. హిజ్బుల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని తాము లెబనాన్‌పై(Israel Vs Lebanon) దాడులు చేస్తున్నామని వెల్లడించారు. లెబనాన్ దేశ ప్రజలు హిజ్బుల్లా మిలిటెంట్లకు మానవ కవచాలుగా మారొద్దని ఆయన కోరారు.
Also Read :Pain Killers : పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త!
తాము లెబనాన్ పౌరులపై యుద్ధం చేయడం లేదని నెతన్యాహూ స్పష్టం చేశారు. హిజ్బుల్లాను అంతం చేసేందుకు మాత్రమే ఈ యుద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ‘‘ఇజ్రాయెల్ నగరాలపై, పౌరులపై హిజ్బుల్లా దాడులు చేస్తోంది. అందుకు అవసరమైన ఆయుధాలను మీ (లెబనాన్ ప్రజల) ఇళ్లలో హిజ్బుల్లా దాచిపెడుతోంది. అందుకే ఈ దాడులు చేయాల్సి వస్తోంది. మా దేశ ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఈ చర్యలు తీసుకోక తప్పదు’’ అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి చెప్పారు. ‘‘లెబనాన్ ప్రజల ఇళ్లలో హిజ్బుల్లా దాచిన ఆయుధాలను నిర్వీర్యం చేసే విషయంలో ఇక రాజీపడం. మా పని పూర్తి చేయనివ్వండి. ఆ తర్వాత ఇళ్లకు తిరిగిరండి’’ అని లెబనాన్ ప్రజలకు నెతన్యాహూ సూచించడం గమనార్హం. దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా ప్రాబల్యం ఎక్కువగా ఉంది. దాని ఆయుధాగారాలు కూడా అక్కడే ఉన్నాయి.అందుకే అక్కడి ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. గతేడాది అక్టోబరు నుంచి పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. పాలస్తీనాపై దాడులు ఆపాలంటూ ఇజ్రాయెల్‌పై లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా గత ఏడాది కాలంగా దాడులు చేస్తోంది. ఎంతకూ ఆ వైపు నుంచి దాడులు ఆగకపోవడంతో ఇప్పుడు ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్‌ను మొదలుపెట్టింది.