Site icon HashtagU Telugu

అమెరికాలోకి అక్రమంగా వెళ్లాలనుకుని వ్యక్తి దుర్మరణం.. కొడుకు, భార్య ఏమయ్యారంటే?

6ac6e7fda7

6ac6e7fda7

గుజరాత్ నుంచి అమెరికాలోకి అక్రమంగా వెళ్తున్న ఓ కుటుంబం దారుణంగా మరణించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఏడాది జనవరిలో ఓ కుటుంబం అమెరికాకు అక్రమంగా వెళ్లాలనుకున్నారు. ఆ క్రమంలో మంచులో గడ్డకట్టి చనిపోయారు. అప్పటి నుంచి గుజరాత్ నుంచి కొందరు అమెరికాలోకి అక్రమంగా వెళ్లేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఘటనలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.

తాజాగా గుజరాత్‌కు చెందినటువంటి ఓ వ్యక్తి అమెరికా, మెక్సికో సరిహద్దులో నిర్మించిన గోడ దానినే ట్రంప్ వాల్ అంటారు. ఆ వాల్ పై నుంచి దూకి మరణించిన సంఘటన అందర్నీ కలచి వేస్తోంది. గాంధీనగర్ నుంచి వెళ్లిన ఆ వ్యక్తి మరణంపై గుజరాత్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా పలు విషయాలు తెలిశాయి. అమెరికాలో కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాల ప్రకారంగా ఆ చనిపోయిన వ్యక్తిని బ్రిజ్ కుమార్ యాదవ్‌గా తెలుసుకున్నారు.

గాంధీనగర్ జిల్లా కలోల్ తాలూకా నివాసిగా అతన్ని అధికారులు గుర్తించారు. భార్య, మూడేళ్ల కుమారుడితో కలిసి అతడు అక్రమంగా అమెరికాలోకి వెళ్లాలని చూశాడు. ఆ క్రమంలో అమెరికా, మెక్సికో సరిహద్దులో నిర్మించిన భారీ గోడను క్రాస్ చేయాలని అనుకున్నాడు. అయితే యూఎస్‌లోకి అతడు ప్రవేశించాలని అనుకుంటుండగా ఆ క్రమంలో గోడపై నుంచి కింద పడి చనిపోయారు. అయితే అతని భార్య మాత్రం అమెరికా వైపు పడిపోగా కొడుకు మెక్సికో వైపు పడ్డాడు. ఈ ఘటన బుధవారం జరిగింది.

బ్రిజ్ కుమార్ యాదవ్ గాంధీనగర్‌లోని కలోల్‌ యూనిట్ గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌‌లోని ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఘటన గురించి మీడియా ద్వారా తెలుసుకున్న రాష్ట్ర క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది. ఇందులో నిజానిజాలను తేల్చాలని అధికారులను ఆదేశించింది. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి పలు చర్యలు తీసుకుంది. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నామని, వారి కుటుంబ సభ్యలను కనుగొనడానికి దర్యాప్తు సాగిస్తున్నట్లు గాంధీనగర్ ఎస్పీ తరుణ్ కుమార్ దుగ్గల్ వెల్లడించారు.