Father: అమ్మ అయిన తండ్రి.. కూతుళ్ళ కోసం ఏకంగా అలా!

పిల్లల ఆనందం కోసం తల్లితండ్రులు ఏమైనా చేస్తూ ఉంటారు. అలాంటి ఘటనే ఈక్విడార్లో జరిగింది. కన్నకూతళ్ల కోసం ఏకంగా లింగానే మార్చుకున్నాడు ఓ తండ్రి.

  • Written By:
  • Publish Date - January 6, 2023 / 08:09 PM IST

Father: పిల్లల ఆనందం కోసం తల్లితండ్రులు ఏమైనా చేస్తూ ఉంటారు. అలాంటి ఘటనే ఈక్విడార్లో జరిగింది. కన్నకూతళ్ల కోసం ఏకంగా లింగానే మార్చుకున్నాడు ఓ తండ్రి. భార్యతో విడిపోయిన సలనాస్ రామోస్ అనే వ్యక్తి తన లింగ మార్పిడి కోసం ఆ దేశ చట్టంతోనే పోరాడాడు. అక్కడి నిబంధనల ప్రకారం పిల్లలు తల్లి దగ్గరే ఉండాలి. దీంతో చట్ట ప్రకారం పిల్లలు మాత్రం తల్లి దగ్గర ఉంటున్నారు. అయితే తన కూతుళ్లు భార్య దగ్గర సంతోషంగా లేరని కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అందుకు ఒప్పుకోలేదు.

దీంతో చట్ట పరంగా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఐడి కార్డులో పురుషుడు నుంచి మహిళగా తన లింగాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు చట్ట ప్రకారం తాను కూడా తల్లిని అయ్యాను అని పిల్లలను తనకి అప్పగించాలని కోర్టును ఆశ్రయించాడు. రామోస్ వాదన విన్న కోర్ట్ దీనిపై తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది.

ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే అతనికి కొత్త తలనొప్పి వచ్చి పడింది. అక్కడి గే కమ్యూనిటీలు మాత్రం అతని నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాము మహిళ నుంచి పురుషుడిగా.. పురుషుడు నుంచి మహిళగా.. లింగం మార్చుకున్నప్పటికీ అధికారిక గుర్తింపు కోసం ఇబ్బందులు ఎదురుకుంటున్నాము అని చెబుతున్నారు. అలాంటిది ఓ పురుషుడు మాత్రం సులభంగా లింగం ఎలా మార్చుకుంటాడు అని వాదిస్తున్నారు.

అయితే రామోస్ మాత్రం వీరి వాదనలను అంగీకరించడం లేదు. తన నిర్ణయంలో ఎలాంటి దురుద్దేశం లేదని కేవలం తన కూతుళ్ళ కోసమే ఇలా చేశాను అని చెప్తున్నాడు. మహిళలతో పాటు పురుషులకు కూడా పిల్లలపై హక్కులు ఉండేందుకే తన పోరాటం అని వివరిస్తున్నాడు. కొంత మంది ప్రజలు కూడా రామోస్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. కూతుళ్ళ సంతోషం కోసం అమ్మగా మారాలి అనుకోవడం అభినందనీయం అని చెబుతున్నారు. ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఆ దేశ కోర్ట్ తీర్పు కోసం అందరు ఎదురు చూస్తున్నారు.