Site icon HashtagU Telugu

Wildlife Population: 48 ఏళ్ల‌లో 69 శాతం తగ్గిన వ‌న్య‌ప్రాణులు.!

Animals

Animals

ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌న్య‌ప్రాణుల సంఖ్య 1970తో పోలిస్తే 2018లో 69 శాతం తగ్గింద‌ని ప్ర‌పంచ వ‌న్య‌ప్రాణులు, జీవ‌రాశుల నివేదిక-2022 పేర్కొంది. ఉష్ణ‌మండల ప్రాంతాల్లో వ‌న్య‌ప్రాణుల క్షీణ‌త దిగ్భ్రాంతిక‌రంగా ఉంద‌ని నివేదిక తెలిపింది. లాటిన్ అమెరికా, క‌రేబియ‌న్ ప్రాంతాల్లో వీటి తగ్గుదల మ‌రింత ఎక్కువ‌గా ఉంద‌ని వివ‌రించింది. అక్క‌డ ఈ క్షీణత స‌రాస‌రిన 94శాతం వ‌ర‌కు ఉంద‌ని నివేదిక పేర్కొంది. ఆఫ్రికాలో 66 శాతం, ఆసియాలో 55 శాతం తగ్గుదల ఉంద‌ని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల క్షీణతకు ప్రధాన కారకాలు ఆవాసాల క్షీణత, కాలుష్యం, వాతావరణ మార్పు, వ్యాధులు అని నివేదిక సూచించింది. పరిశోధనలపై వ్యాఖ్యానిస్తూ WWF ఇంటర్నేషనల్ డైరెక్టర్ జనరల్ మార్కో లాంబెర్టిని ఇలా అన్నారు. మానవ ప్రేరిత వాతావరణ మార్పు, జీవవైవిధ్య నష్టం, డబుల్ ఎమర్జెన్సీలను ఎదుర్కొంటున్నాం. ఇది ప్రస్తుత, భవిష్యత్తు తరాల శ్రేయస్సును ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. వన్యప్రాణుల జనాభాలో వినాశకరమైన పతనాన్ని చూపుతున్న ఈ కొత్త డేటా గురించి WWF చాలా ఆందోళన చెందుతోందని ఆయ‌న అన్నారు. WWF ఇండియా సెక్రటరీ జనరల్, CEO రవి సింగ్ మాట్లాడుతూ.. LPR ( Living Planet Report) 2022లో వాతావరణ మార్పు, జీవవైవిధ్య నష్టం, పర్యావరణ సమస్యలే కాకుండా ఆర్థిక, అభివృద్ధి, భద్ర, సామాజిక సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.