జార్జియా(Georgia )లో భారతీయ పర్యాటకులకు జరిగిన ఘోర అవమానము దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపుతోంది. సరైన ఈ-వీసాలు, పత్రాలు ఉన్నప్పటికీ 56 మంది భారతీయులను ఆర్మేనియా నుంచి జార్జియాలోకి ప్రవేశం నిరాకరించడం ఆ దేశ అధికారుల వైఖరిని బయటపెట్టింది. ముఖ్యంగా మహిళా పర్యాటకురాలు ధృవీ పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అవమానకర అనుభవాన్ని పంచుకోవడంతో విషయం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఐదు గంటల పాటు గడ్డకట్టే చలిలో నిలబెట్టడం, ఆహారం, టాయిలెట్ వంటి మౌలిక సదుపాయాలను కూడా ఇవ్వకపోవడం పర్యాటకుల(Indian Tourists)పై అమానుష వైఖరికి నిదర్శనం. పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని, వారిని పశువుల్లా ఫుట్‌పాత్‌పై కూర్చోబెట్టడం వంటి వివరాలు నెటిజన్లలో మరింత ఆగ్రహాన్ని రేపుతున్నాయి.
Safety of Women : మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి – పవన్
ఈ ఘటనలో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. అధికారులు భారతీయ పర్యాటకుల పత్రాలను సరిగా తనిఖీ చేయకుండా వీసాలు సక్రమం కావని నిర్ధారణ లేకుండానే వెనక్కి పంపించటం. అంతేకాకుండా, వారిని నేరస్థుల్లా వీడియోలు తీయడం, కానీ పర్యాటకులు తమ అనుభవాన్ని రికార్డు చేయకుండా అడ్డుకోవడం వారి ఉద్దేశ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇలాంటి చర్యలు కేవలం అన్యాయం కాకుండా, పర్యాటకుల గౌరవానికి తీవ్రమైన అవమానం. ఈ ఘటనను అనుభవించిన పర్యాటకులు “జార్జియాలో భారతీయులపై వివక్ష చాలా కాలంగా కొనసాగుతోందని” ఆరోపించడం, ఇది ఒకే సంఘటన కాదని సూచిస్తోంది.
ఈ ఘటనపై భారత ప్రభుత్వం తక్షణమే స్పందించి, జార్జియా అధికారుల నుండి వివరణ కోరాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు అధికారికంగా స్పందించకపోవడం నెటిజన్లలో అసంతృప్తిని కలిగిస్తోంది. జాతి వివక్ష, అన్యాయం, పర్యాటకుల భద్రతల వంటి అంశాలు అంతర్జాతీయ సంబంధాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రయాణించే సమయంలో ఇలాంటి అవమానకర అనుభవాలు ఎదురుకాకుండా దౌత్యపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు స్పష్టంగా చెబుతున్నారు. ఈ సంఘటన జార్జియాలోని వ్యవస్థాపక సమస్యలను మాత్రమే కాకుండా, విదేశాల్లో భారతీయుల గౌరవం రక్షించాల్సిన అత్యవసరతను మరోసారి గుర్తు చేసింది.