Naked Trump Statue : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ తరుణంలో నెవాడా రాష్ట్రంలోని లాస్ వెగాస్ నగరంలో కొందరు ట్రంప్ నగ్న తోలుబొమ్మను ప్రదర్శన కోసం ఏర్పాటు చేశారు. దీని సైజు.. 43 అడుగులు. బరువు.. 2720 కేజీలు. ఈ తోలుబొమ్మ జీవకళ ఉట్టిపడేలా ఉంది. అయితే నగ్నంగా ఉండటం అందరినీ విస్మయపరుస్తోంది. కనీసం ప్రైవేట్ పార్ట్స్ కూడా కవర్ చేసి లేకపోవడం దారుణం. ఈ తోలుబొమ్మను రీబార్‌పై నురుగుతో తయారు చేశారు. లాస్ వెగాస్ నగరం నుంచి ఉతా రాష్ట్రం వైపుగా వెళ్లే ‘ఇంటర్ స్టేట్ 15’ హైవేపై ఈ భారీ తోలుబొమ్మను ఏర్పాటు చేశారు. చుట్టూ ఫెన్సింగ్ కూడా వేశారు.
Also Read :Hassan Nasrallah : హిజ్బుల్లా చీఫ్ హత్యపై యూఎన్‌కు ఇరాన్.. ఇజ్రాయెల్ తప్పేం లేదన్న అమెరికా
2016 సంవత్సరంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలోనూ డొనాల్డ్ ట్రంప్ నగ్న ప్రతిమను ఇదేవిధంగా న్యూయార్క్ నగరంలో ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆ తరహా ప్రచారం వల్ల ట్రంప్‌కు పెద్దసంఖ్యలోనే ఓట్లు వచ్చాయి. ఈసారి అధికార డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ నుంచి భారీ పోటీని ఎదుర్కొంటున్న ట్రంప్‌కు.. నగ్న ప్రతిమ(Naked Trump Statue) ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచిచూడాలి. ప్రస్తుతం అమెరికా సోషల్ మీడియాలో ట్రంప్ నగ్న ప్రతిమపై వాడివేడి చర్చ జరుగుతోంది. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధమైన కామెంట్ చేస్తూ.. తమతమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరుస్తున్నారు. తన నగ్న ప్రతిమను ఏర్పాటు చేయడంపై ట్రంప్ కానీ, రిపబ్లికన్ పార్టీ వర్గాలు కానీ ఇంకా స్పందించలేదు. అమెరికా రాజకీయాల్లో ప్రతీకార దాడులు జరగడం చాలా తక్కువ. విమర్శలను, వ్యంగ్య వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకోవడం అక్కడి రాజకీయ నేతల పరిపక్వతా స్థాయికి నిదర్శనం.