Site icon HashtagU Telugu

Earthquake : టిబెట్‌ను వణికించిన భూకంపం.. 55 మంది మృతి, 65 మందికి గాయాలు

Earthquake Nepal Tibet Border Lobuche

Earthquake : ఇవాళ తెల్లవారుజామున నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీని ప్రభావం ప్రధానంగా టిబెట్‌పై పడినట్లు తెలుస్తోంది. ఈ భూకంపం వల్ల టిబెట్‌లో దాదాపు 55 మంది చనిపోయినట్లు సమాచారం. దాదాపు 65 మందికి గాయాలైనట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. చనిపోయిన వారి సంఖ్య, క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరగొచ్చని అంటున్నారు. చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా ఈమేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. టిబెట్ ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉంది. టిబెట్‌ను పశ్చిమ చైనాలో ఒక భాగంగా చైనా చెబుతుంటుంది. అందుకే.. ‘‘పశ్చిమ చైనాలోని పర్వత ప్రాంతంలో బలమైన భూకంపం(Earthquake) సంభవించింది’’ అని ఈ కథనంలో చైనా వార్తా సంస్థ ప్రస్తావించింది. భూకంప కేంద్రంగా టిబెట్‌ రాజధాని లాసాకు దాదాపు 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోబుచే పట్టణంలో 10 కిలోమీటర్ల లోతులో ఉందని తెలిపింది. భూకంప కేంద్రం పరిసర ప్రాంతాలు సముద్ర మట్టానికి సగటున 4,200 మీటర్ల ఎత్తులో ఉన్నాయని పేర్కొంది. ఈ భూకంప తీవ్రత 7.1 అని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం వెల్లడించింది. మొత్తం మీద ఈ భూకంపం వల్ల టిబెట్‌లో దాదాపు 69వేల మంది ప్రభావితులయ్యే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.

Also Read :Delhi Polls Schedule : ఇవాళే ఢిల్లీ పోల్స్ షెడ్యూల్.. వచ్చే నెల 10లోగా ఎన్నికలు ?

మరోవైపు నేపాల్ రాజధాని ఖాట్మండులో కూడా భూకంపం సంభవించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. నేపాల్‌లో ఎవరెస్ట్ పర్వతం సమీపంలో ఉండే ప్రాంతాల ప్రజలు కూడా భూప్రకంపనలను ఫీలయ్యారు. అయితే అక్కడ ప్రాణనష్టం కానీ ఆస్తినష్టం కానీ పెద్దగా సంభవించలేదు. యురేషియా టెక్టోనిక్ ప్లేట్స్‌తో కూడిన భూభాగంలో ఉండటం వల్ల నేపాల్, టిబెట్‌ దేశాల్లో భూకంపాలు రావడం అనేది సర్వసాధారణం. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో 2015లో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో అప్పట్లో నేపాల్‌లో దాదాపు 9,000 మంది చనిపోయారు. భారీగా ఆస్తినష్టం కూడా  జరిగింది.