260 Dead Bodies : ఇజ్రాయెల్ లో హమాస్ ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. గాజాకు సమీపంలోని కిబ్బట్జ్ రీమ్ సమీపంలో మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్న నేచర్ పార్టీ సైట్‌పై హమాస్ మిలిటెంట్లు ఆకస్మికంగా దాడి చేసి తూటాల వర్షం కురిపించారు. ఈ దాడిలో దాదాపు 260 మందికిపైగా చనిపోయారని గుర్తించారు. అప్పటిదాకా మ్యూజిక్ తో మార్మోగిన ఆ ప్రదేశం.. ఆ తర్వాత శవాల దిబ్బగా మారింది. ఈ ఘటన అనంతరం అక్కడికి చేరుకున్న బాధిత కుటుంబాల వారి రోదనలు మిన్నంటాయి. మ్యూజిక్ ఫెస్టికల్ వేదిక పరిసరాల్లో ఎక్కడ చూసినా మృతదేహాల కుప్పలే కనిపించాయి. మ్యూజిక్ సైట్ పై తొలుత రాకెట్ దాడి చేసి.. ఆ వెంటనే హమాస్ మిలిటెంట్లు అక్కడికి వచ్చి కాల్పులు జరిపి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ నేచర్ పార్టీకి వేలాది మంది హాజరయ్యారని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
హమాస్ ఉగ్రమూకల కాల్పులు మొదలయ్యాక.. అక్కడ ఉన్న వాళ్లంతా అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని పరుగులు తీశారు. చివరకు కార్లు ఎక్కి పారిపోతున్న వాళ్లను కూడా ఉగ్రమూకలు వదల్లేదు. వారిని వెంటాడి కార్లను ఆపి మరీ కాల్పులు జరిపి హతమార్చారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇజ్రాయెల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ 260 మరణాలు కాకుండా.. హమాస్ శనివారం జరిపిన రాకెట్ల దాడిలో ఇజ్రాయెల్ లో చనిపోయిన వారి సంఖ్య 1000కి పెరిగింది. ఇక ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ ఉగ్రవాద స్థావరాలున్న గాజాపై జరిపిన దాడిలో దాదాపు 600 మంది పాలస్తీనియులు (260 Dead Bodies) చనిపోయారు.