242 Missings : జనవరి 1న జపాన్‌లో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 92కు పెరిగింది. ఇక ఆచూకీ గల్లంతైన వారి సంఖ్య 242కు చేరుకుంది. దీంతో వీరందరి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నాయి. సుజు, వాజిమా నగరాల్లో ఇంకా చాలామంది బాధితులు ఇళ్ల శిథిలాల కిందే చిక్కుకుపోయి ఉన్నారని అనుమానిస్తున్నారు. ఈ నగరాల్లోని వేల కుటుంబాలకు ఇప్పటికీ నీటి సప్లై, విద్యుత్తు సప్లై జరగడం లేదు. సుజు, వాజిమా సిటీలకు వెళ్లే రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో అక్కడి ప్రజలు నిస్సహాయులుగా ఉండిపోతున్నారు. ఈ నగరాల్లో భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయిన ఇద్దరు ముసలివారిని 72 గంటల తర్వాత గురువారం రోజు వెలికి తీశారు. ఇలా గల్లంతైన వారిని కాపాడేందుకు రంగంలోకి దింపిన రెస్క్యూ టీమ్‌ల సంఖ్యను జపాన్ సర్కారు డబుల్ చేసింది. ప్రస్తుతం గాలింపు చర్యల్లో 4,600 మంది పాల్గొంటున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మరణాల సంఖ్య రానున్న రోజుల్లో 200 దాటినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు(242 Missings) అంచనా వేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
- వాజిమా సిటీలోని సెన్మడియా పాకెట్ పార్క్‌లో 60 మంది టూరిస్టులు చిక్కుకున్నారు. వీరంతా ఆహారం అందక అవస్థలు పడుతున్నారు.
- సుజు నగరంలో రూట్ – 52 మార్గం మొత్తం చెట్లు కూలిపోయి వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సోమవారం రోజు భూకంపం సంభవించగా.. జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది శుక్రవారం ఇక్కడికి చేరుకోవడం గమనార్హం.
- సుజు నగరంలోని రెండు షెల్టర్లలో ఇళ్లు కూలిపోయిన 150 మంది ప్రజలు తలదాచుకుంటున్నారు. వీరికి సహాయ సామగ్రి ఇంకా చేరలేదు.
- భూకంపం ధాటికి పగుళ్లు ఏర్పడి.. సుజు ప్రాంతంలో చాలా ఇళ్లు కూలిపోవడానికి రెడీ అయ్యాయి.