24 Killed : పాకిస్తాన్‌లో ఘోరం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉన్న డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని ఆర్మీ స్థావరంపై ఇవాళ తెల్లవారుజామున ఆత్మాహుతి దాడి జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో దాదాపు 24 మంది(24 Killed) చనిపోయారు. ఈ దాడి జరిగిన టైంలో ఆర్మీ బేస్‌లోని భవనంలో సైనికులు సివిల్ డ్రెస్‌లో గాఢ నిద్రలో ఉన్నారు. ఆర్మీ బేస్ ప్రధాన ద్వారం వద్ద ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్థాలతో కూడిన తన వాహనాన్ని పేల్చుకున్నాడు. ఈ పేలుడు తీవ్రతకు సమీపంలోని ఆర్మీ సిబ్బంది నివసించే భవనం పేకమేడలా కూలిపోయింది.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో 24 మంది సైనికులు చనిపోగా, పదుల సంఖ్యలో సైనిక సిబ్బంది గాయపడ్డారు. ఈక్రమంలో కొందరు ఉగ్రవాదులు పాక్ ఆర్మీ సిబ్బందిపైకి కాల్పులు జరిపారు. ఆత్మాహుతి దాడి జరిగాక ఉగ్రవాదులు, సైనికుల మధ్య చాలాసేపు ఫైరింగ్ జరిగింది. దీంతో తీవ్ర గాయాలపాలైన సైనికులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే అవకాశం లేకుండాపోయింది. ఇలా చికిత్స అందక చాలామంది సైనికులు చనిపోయారని సమాచారం. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.
Also Read: TSPSC Paper Leak : TSPSC చైర్మన్ రాజీనామాలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
ఈ ఘోరమైన దాడికి తామే బాధ్యులమని పాకిస్థాన్ తాలిబాన్ గ్రూప్ ప్రకటించింది. పాకిస్తాన్ తాలిబన్ గ్రూపుతో సంబంధం కలిగి ఉన్న ‘‘తెహ్రీక్- ఏ-తాలిబన్ పాకిస్తాన్’’(TTP)కు చెందిన మిలిటెంట్లు ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని భావిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పాకిస్థాన్ సైన్యం ఇంకా స్పందించలేదు.