22 Journalists Killed: ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం వేళ సాహసోపేతంగా న్యూస్ కవరేజీ చేస్తూ దాదాపు 22 మంది జర్నలిస్టులు అమరులయ్యారు. అక్టోబరు 7న ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు వీరంతా వేర్వేరు ఘటనల్లో, వేర్వేరు చోట్ల ప్రాణాలు కోల్పోయారు. ఈవివరాలను ‘కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్’ (సీపీజే) వెల్లడించింది. అమరులైన జర్నలిస్టులలో అత్యధికంగా 18 మంది పాలస్తీనియన్లు, ముగ్గురు ఇజ్రాయిలీలు, ఓ లెబనీస్ జర్నలిస్టు ఉన్నారు.18 మంది పాలస్తీనియన్లు గాజా ప్రాంతంలో న్యూస్ కవరేజీ చేస్తుండగా చనిపోయారు. ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడుల్లో పాలస్తీనా జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ చేసిన దాడుల్లో ఇద్దరు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోగా, 8 మంది జర్నలిస్టులు గాయపడ్డారు. మరో ముగ్గురి ఆచూకీ తెలియడం లేదు. జర్నలిస్టులు చేస్తున్న త్యాగాలను సీపీజే (22 Journalists Killed) కొనియాడింది. జర్నలిస్టులపై దాడి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఇది కూడా యుద్ధ నేరమే అని ఆరోపించింది.
We’re now on WhatsApp. Click to Join.
బందీల విడుదలలో కొత్త అధ్యాయం.. బైడెన్ హర్షం
దాదాపు 200 మంది విదేశీయులను బందీలుగా తీసుకెళ్లిన హమాస్.. వారిలో అమెరికాకు చెందిన ఇద్దరు తల్లీకూతుళ్లను వదిలేశారు. అయితే బందీలు అందరినీ విడిచిపెట్టే వరకు పోరాటం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు స్పష్టం చేశారు. బందీలను వదిలే వరకు గాజాలోకి నిత్యావసరాలను వెళ్లనివ్వబోమని ఆయన తేల్చి చెప్పారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న తల్లీకూతుళ్ల విడుదలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. మానవతా కోణంలో భాగంగా తల్లీకూతుళ్లను విడుదల చేసినట్లు హమాస్ ప్రకటించింది. తమ దేశంలో ఉన్న హమాస్ రాజకీయ కార్యాలయంతో అమెరికన్ల విడుదలపై సంప్రదింపులు జరిపిన ఖతర్ కు బైడెన్ కృతజ్ఞతలు తెలిపారు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న తన పౌరులతో సహా మిగిలిన బందీలను కూడా విడిపించేందుకు ఖతర్ తో కలిసి పని చేస్తున్నట్లు బైడెన్ వెల్లడించారు.