Nobel Prize 2024 : నోబెల్ బహుమతులపై స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో నోబెల్ అసెంబ్లీ సోమవారం కీలక ప్రకటన చేసింది. వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొనడంతో పాటు ట్రాన్స్‌క్రిప్షన్ తర్వాత జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో దాని పాత్ర గురించి తెలుసుకున్నందుకు వారిద్దరికి సంయుక్తంగా నోబెల్ బహుమతిని అనౌన్స్ చేశారు. జీవులు ఎలా అభివృద్ధి చెందుతాయి ? అవి ఎలా పనిచేస్తాయి ? అనే అంశాలతో ముడిపడిన ప్రాథమిక సమాచారాన్ని విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ గుర్తించగలిగారని నోబెల్ అసెంబ్లీ (Nobel Prize 2024) వెల్లడించింది.
‘మైక్రో ఆర్ఎన్ఏ’ అనేది .. మన శరీరంలోని జన్యువుల పనితీరును నియంత్రించడంలో దోహదపడే కీలకమైన అణువు (మాలిక్యూల్). మైక్రో ఆర్ఎన్ఏను తాజాగా విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లు గుర్తించారు. మన శరీరంలోని అన్ని కణాల్లోనూ ఒకే రకమైన జన్యువులు ఉంటాయి. అయితే కణాలు మాత్రం భిన్నమైనవి ఉంటాయి. కండరాలు, నరాల్లో వేర్వేరు రకాల కణాలు ఉంటాయి. ఎందుకంటే శరీరంలోని ఒక్కో భాగం ఒక్కో రకమైన పనిచేస్తుంది. అందుకు అనుగుణమైన రకాలకు చెందిన కణాలు వాటిలో ఇమిడిపోయి ఉంటాయి.
Also Read :Maldives : భారతీయ టూరిస్టులకు మాల్దీవుల అధ్యక్షుడు ప్రత్యేక విజ్ఞప్తి
జీన్ రెగ్యులేషన్ అనే ప్రక్రియ వల్ల మన శరీరంలోని వివిధ భాగాల్లో ఆయా భాగాలకు అనువైన కణాలు తయారవుతాయి. జీన్ రెగ్యులేషన్ ప్రక్రియ అనేది శరీరంలోని వివిధ భాగాల్లో అక్కడి అవసరాలకు అనుగుణంగా కణాలను ‘స్విచ్ ఆన్’ చేస్తుంటుంది. ఈ ప్రక్రియతో ముడిపడిన కొత్త విషయాలను విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లు తాజాగా తమ పరిశోధనలో గుర్తించారు. అందుకే వారికి సంయుక్తంగా నోబెల్ బహుమతిని ప్రకటించారు.