Pakistan Train Hijack: ట్రైన్ హైజాక్ ఘటనతో పాకిస్తాన్‌లో ఉద్రిక్తత నెలకొంది. క్వెట్టా నగరం నుంచి పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును మంగళవారం మధ్యాహ్నం బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) వేర్పాటువాదులు హైజాక్ చేశారు. ఇప్పటికీ ఈ రైలులోని పలు బోగీలు వారి ఆధీనంలోనే ఉన్నాయి. ఇప్పటివరకు బీఎల్ఏ వేర్పాటువాదుల కాల్పుల్లో 20 మందికిపైగా ప్రయాణికులు, 30 మందికిపైగా పాక్ భద్రతా సిబ్బంది చనిపోయినట్లు తెలిసింది. హైజాక్ అయిన సమయానికి ఈ రైలులో దాదాపు 450 మంది ప్రయాణికులు ఉన్నారు. వారికి రక్షించేందుకు పాక్ ఆర్మీ, భద్రతా బలగాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు 155 మందికిపైగా ప్రయాణికులను కాపాడారు. 27 మంది బీఎల్ఏ ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
పాక్ ఆర్మీకి బీఎల్ఏ అల్టిమేటం
ఈనేపథ్యంలో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) వేర్పాటువాదులు కీలక ప్రకటన చేశారు. తాము హైజాక్ చేసిన రైలులో పాక్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగితే, మరింత మంది ప్రయాణికులను చంపేస్తామని స్పష్టం చేశారు. బెలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమాన్ని గౌరవించకుంటే హింసాకాండ ఇలాగే కొనసాగుతుందని అల్టిమేటం ఇచ్చారు. ఇంకో 48 గంటలు మాత్రమే తాము ఎదురు చూస్తామని బీఎల్ఏ తేల్చి చెప్పింది.
Also Read :Coverts In Congress: కాంగ్రెస్‌లో కోవర్టులు.. రాహుల్‌గాంధీ వ్యాఖ్యల్లో పచ్చి నిజాలు
మా వాళ్లను జైళ్ల నుంచి వదిలేస్తే చాలు : బీఎల్ఏ
ఈ అంశంపై బీఎల్ఏ(Pakistan Train Hijack) అధికార ప్రతినిధి జీయంద్ బలూచ్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ చేయడం మూర్ఖత్వం. సైనిక బలంతో ఏదీ సాధించలేరు. డ్రోన్లు, ఆర్టిల్లరీ షెల్లింగ్లతో రైలులో ఉన్న మా హైజాకర్లపై దాడులు చేస్తున్నారు. మేం బెలూచిస్తాన్ వేర్పాటువాద ఖైదీల విడుదలను కోరుతున్నాం. అందుకు ప్రతిగా రైలులోని ప్రయాణికులను వదిలేసేందుకు మేం సిద్ధమే’’ అని ఆయన ప్రకటించారు. బెలూచిస్తాన్ ప్రాంతంలోని చాలా గనుల మైనింగ్ కాంట్రాక్టులను చైనా కంపెనీలు పొందాయి. దీన్ని బెలూచిస్తాన్ వేర్పాటువాదులు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. చైనాకు పాక్ సంపదను దోచిపెడుతున్నారని ఫైర్ అవుతున్నారు.