16 Die Of Gas Leakage: పాకిస్థాన్‌లో గ్యాస్ లీక్ ఘటనలు.. చిన్నారులతో సహా 16 మంది మృతి

పాకిస్థాన్‌లోని నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నగరంలో గత వారం రోజులుగా గ్యాస్ లీక్ (Gas Leakage) ఘటనల్లో చిన్నారులతో సహా కనీసం 16 మంది మరణించారు. పోలీసులు ఈ మేరకు సమాచారం ఇచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Gas

Gas

పాకిస్థాన్‌లోని నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నగరంలో గత వారం రోజులుగా గ్యాస్ లీక్ (Gas Leakage) ఘటనల్లో చిన్నారులతో సహా కనీసం 16 మంది మరణించారు. పోలీసులు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. బుధవారం క్వెట్టాలోని కిల్లి బడేజాయ్ ప్రాంతంలో మట్టి గోడల ఇంటిలో గ్యాస్ లీక్ అయ్యి పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. పిల్లలు నిద్రిస్తున్న సమయంలో గదిలో గ్యాస్ నిండిపోయి పేలిపోవడంతో ఇంటి గోడలు కూలిపోయాయని పోలీసులు తెలిపారు.

Also Read: 50 Killed: నైజీరియాలో బాంబ్ బ్లాస్ట్.. 50 మంది దుర్మరణం

క్వెట్టాలోని మరొక ప్రాంతంలో తన గదిలో గ్యాస్ పీల్చి పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ మరణించాడు. గత వారం నుండి ప్రతిరోజూ అనేక కేసులు నమోదయ్యాయని, ఇందులో డజనుకు పైగా ప్రజలు మరణించారని, వారి ఇళ్లలో గ్యాస్ లీకేజీ కారణంగా డజన్ల కొద్దీ స్పృహతప్పి పడిపోయారని సీనియర్ పోలీసు అధికారి ధృవీకరించారు. భారీ గ్యాస్ లోడ్ షెడ్డింగ్, అల్పపీడనం లీకేజీకి కారణమని వారు చెప్పారు.

నివేదికల ప్రకారం.. గ్యాస్ లోడ్ షెడ్డింగ్, లీకేజీ సమస్య క్వెట్టాలోనే కాకుండా జియారత్, కలాత్ వంటి సమీప ప్రాంతాలలో కూడా వెలుగులోకి వచ్చింది. బలూచిస్థాన్‌లో గత నెల రోజులుగా చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. మంగళవారం గ్యాస్ లీక్ ఘటనతో ఓ వ్యక్తి, అతని ముగ్గురు కుమారులు ఊపిరాడక మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అమానుల్లా (50), అతని ముగ్గురు కుమారులు హఫీజుల్లా, ముహిబుల్లా ,బీబుల్లా మరణించారు.

  Last Updated: 26 Jan 2023, 09:51 AM IST