Site icon HashtagU Telugu

Israel Vs Iran : ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ ఎటాక్.. 11 మంది మృతి

Israel Operation

Israel Vs Iran

Israel Vs Iran : ఇజ్రాయెల్ మరోసారి సిరియాపై విరుచుకుపడింది.  ఈసారి సిరియా రాజధాని డమస్కస్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయ కాన్సులర్‌ విభాగంపై గగనతల దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఇద్దరు ఇరాన్ ఆర్మీ జనరల్స్‌, ఐదుగురు అధికారులు సహా మొత్తం 11 మంది మృతిచెందారని సిరియా అధికారులు, ఇరాన్ సైన్యం తెలిపాయి. ఈ దాడిపై ఇంకా ఇజ్రాయెల్ స్పందించలేదు. ఈ దాడితో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దాడి ఘటనలో కుప్పకూలిన కాన్సులర్‌ భవనం పక్కనే ఇరాన్ రాయబార కార్యాలయం ఉంది. ఈ దాడిలో చనిపోయిన ఇరాన్‌ జనరల్‌ అలీ రెజా జెహ్‌దీ 2016 వరకు లెబనాన్‌, సిరియా దేశాల్లో ఖుద్స్‌ బలగాలకు నేతృత్వం వహించారు.ప్రస్తుతం ఈ దాడి జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనను సిరియాలోని ఇరాన్‌ రాయబారి హొస్సేన్‌ అక్బరీ ఖండించారు. దాడిలో 11 మంది చనిపోయినట్లు ఆయన వెల్లడించారు. ఇజ్రాయెల్‌(Israel Vs Iran) ప్రతిదాడి ఎదుర్కోక తప్పదని ఇంతే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.

We’re now on WhatsApp. Click to Join

ఇజ్రాయెల్ మీడియాలో ఇలా.. 

సిరియాలోని ఇరాన్‌ ఎంబసీపై జరిగిన దాడిపై ఇజ్రాయెల్‌ ఇంకా స్పందించలేదు. అయితే ఈ దాడి ఇరాన్‌ దౌత్య కార్యాలయం లక్ష్యంగా జరగలేదని.. దానిని ఆనుకుని ఉన్న భవనం టార్గెట్‌గా జరిగి ఉండొచ్చని ఇజ్రాయెల్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. భవనానికి ఖాసీం సోలెయిమానీ భారీ కటౌట్‌ ఉండడంతో అందులో ఉన్న సభ్యుల్ని టార్గెట్‌ చేసుకుని దాడులు జరిపి ఉంటుందని ఆ కథనాల్లో ప్రస్తావించారు. మిడిల్‌ ఈస్ట్‌లో ఇరాన్‌ మిలిటరీ ఆపరేషన్స్‌కి సులేమానీని ఆద్యుడిగా పేర్కొంటారు. అయితే 2020లో సిరియా భూభాగంలో అమెరికా జరిపిన డ్రోన్‌ దాడుల్లో  సులేమానీ చనిపోయారు.

ఇజ్రాయెల్‌ మూల్యం చెల్లించక తప్పదు

ఇరాన్‌ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయెల్‌ దాడిని లెబనాన్‌ రెబల్‌ గ్రూప్‌ హిజ్బుల్లా ఖండిచింది. ఇరాన్‌ ఆర్మీ  సభ్యుల మరణానికి కారణం అయినందుకు ఇజ్రాయెల్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరికలు జారీ చేసింది. గాజా యుద్ధంలో హమాస్‌కు ఇటు హిజ్బుల్లా, అటు ఐఆర్‌జీసీలు మిత్రపక్షంగా ఉన్నాయి.  సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌కు ఇరాన్‌ మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తోంది. పైగా ఇరాన్‌ తరఫున పలు గ్రూపులు సిరియా, లెబనాన్‌లలో స్థావరాలు ఏర్పరుచుకున్నాయి. అందుకే ఇజ్రాయెల్‌ సిరియాను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. అయితే.. గాజా సంక్షోభం తర్వాత ఈ దాడుల ఉధృతిని పెంచింది.

Also Read :Vastu Tips: ఇంట్లో వెండి ఏనుగు విగ్రహాలు పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?