హైదరాబాద్ (Hyderabad) నగరంలో అద్దె ఇళ్ల (Rental Houses) పేరుతో మోసాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ఈజీగా ఇల్లు దొరుకుతుందనే ఆశతో ఇంటి కోసం వెతుకుతున్నవారిని టార్గెట్ చేస్తూ స్కామర్లు నకిలీ ప్రకటనలతో మోసం చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా లో ఓ బాధితుడు తన అనుభవాన్ని పంచుకున్నాడు. ప్రకటనలో అద్దె చాలా తక్కువగా ఉండటంతో అనుమానంతో ఉన్నప్పటికీ నంబర్‌కి కాల్ చేశాడు. కాల్ చేసిన వెంటనే ఓ వ్యక్తి ఓనర్ నంబర్ ఇస్తూ, ఇంటిని చూడాలంటే ముందుగా రూ.1,500 ఎంట్రీ ఫీజు చెల్లించాలని చెప్పాడట. డబ్బు చెల్లించిన తర్వాత మాత్రం ఆ వ్యక్తి ఆచూకీ లేకుండా పోయాడు.
ఈ పోస్ట్‌కు అనేక మంది యూజర్లు తమ అనుభవాలను షేర్ చేశారు. లాన్కో హిల్స్ వంటి గేటెడ్ కమ్యూనిటీల్లో 1 బీహెచ్‌కే లభ్యం కాకపోయినా, నకిలీ ప్రకటనల ద్వారా డబ్బు వసూలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఎంట్రీ ఫీజు అడగడం, అపార్ట్‌మెంట్ అసలు ఉన్నదో లేదో తెలియకుండానే డబ్బులు తీసుకోవడం వంటి మోసాలపై వారు హెచ్చరించారు. ఇది స్కామ్ అని ముందుగానే గ్రహించినవారు తప్పించుకోగలిగారు. అయితే కొంతమంది మాత్రం డబ్బులు పోగొట్టుకుని మోసపోయారు.
ఇలాంటి మోసాలకు బలికాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మార్కెట్ ధర కంటే తక్కువ అద్దెకు ప్రకటనలు కనిపిస్తే అవి స్కామ్ అయి ఉండే అవకాశం ఉంది. ఇంటిని చూడటానికి ముందుగా ఎంట్రీ ఫీజు అడిగితే అలర్ట్ కావాలి. ఇంటి యజమాని వివరాలు, ప్రాపర్టీ స్థానికులతో లేదా అపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌తో నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా సోషల్ మీడియా, నకిలీ వెబ్‌సైట్లలో ఇచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గేటెడ్ కమ్యూనిటీలలో 1 BHK ఫ్లాట్‌లు అందుబాటులో ఉండవు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.