సంక్రాంతి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తోచ్చేది రంగురంగుల గాలిపటాలు. ఈ గాలిపటాలు ఎగురవేయడం వెనుక పురాణ గాథలు మరియు ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. తులసీదాస్ రాసిన రామచరితమానస్ ప్రకారం, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు మకర సంక్రాంతి రోజున తన సోదరులు మరియు హనుమంతుడితో కలిసి గాలిపటాలు ఎగురవేశారని ప్రతీతి. రాముడు ఎగురవేసిన గాలిపటం ఎంత ఎత్తుకు ఎగిరిందంటే, అది ఏకంగా ఇంద్రలోకానికి చేరుకుందని పురాణాలు చెబుతున్నాయి. ఆనాటి నుండి సంక్రాంతి పండుగ రోజున గాలిపటాలను ఎగురవేయడం ఒక పవిత్రమైన ఆచారంగా, దైవానికి కృతజ్ఞతలు తెలిపే సంప్రదాయంగా మారుతూ వస్తోంది.
Happy Sankranti Kites
గాలిపటాల చరిత్రను పరిశీలిస్తే, వీటి పుట్టుక చైనాలో జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. ప్రారంభంలో వీటిని కేవలం వినోదం కోసం కాకుండా సైనిక అవసరాల కోసం రూపొందించారు. ప్రాచీన చైనాలో యుద్ధ సమయాల్లో శత్రువుల కోటల మధ్య దూరాన్ని కొలవడానికి, గూఢచారి సమాచారాన్ని పంపడానికి మరియు సైనికులకు సంకేతాలు ఇవ్వడానికి గాలిపటాలను ఉపయోగించేవారు. కాలక్రమేణా ఈ విద్య ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం అమెరికా, ఫ్రాన్స్, జపాన్ మరియు థాయ్‌లాండ్ వంటి దేశాలలో గాలిపటాల పండుగలను అంతర్జాతీయ వేడుకలుగా నిర్వహిస్తున్నారు. ప్రతి దేశం తమ సొంత సంస్కృతికి అనుగుణంగా వివిధ ఆకృతులలో గాలిపటాలను తయారుచేసి పోటీలు నిర్వహిస్తుంటాయి.
గాలిపటాలు ఎగురవేయడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆకాశంలో వేగంగా కదిలే గాలిపటాన్ని నిశితంగా గమనించడం వల్ల కంటి నరాలు మరియు కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుంది, ఇది కంటిచూపును మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతారు. ఎండలో నిలబడి గాలిపటాలు ఎగురవేయడం వల్ల శరీరానికి కావాల్సిన ‘విటమిన్ డి’ పుష్కలంగా అందుతుంది, ఇది చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండా, గాలిపటాన్ని నియంత్రించే క్రమంలో మెడను పైకి ఎత్తి ఉంచడం వల్ల మెడ ఎముకలకు, కీళ్లకు సరైన కదలిక లభిస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచి, ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
