Site icon HashtagU Telugu

Monkey: కోతిని పట్టుకున్నందుకు ఏకంగా రూ.21 వేలు బహుమతి.. ఈ కోతి మహాముదురు?

Monkey

Monkey

మామూలుగా ఎవరైనా మనుషులు తప్పిపోయినప్పుడు అలాగే దొంగలు పారిపోయినప్పుడు వారి ఆచూకీ కోసం పేపర్లలో ప్రకటనలు ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా పట్టుకునే వారికి ప్రైజ్ మనీని బహుమతులుగా కూడా ప్రకటిస్తూ ఉంటారు. కానీ విచిత్రంగా ఒక కోతిని పట్టుకోడానికి మున్సిపల్ అధికారులు ఒక ప్రకటన ఇవ్వడంతో పాటు ఆ కోతిని పట్టుకుంటే ఏకంగా 21 వేల రూపాయలను ఇస్తామంటూ బహుమతిగా ప్రకటించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. కోతిని పట్టుకోవడంలో అధికారుల ప్రయత్నాలు విఫలం అవడంతో ఆ కోతిని పట్టుకోడానికి ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు.

ఈ ఘటన మధ్యప్రదేశ్‌ లోని రాజ్‌గఢ్‌ పట్టణంలో చోటుచేసుకుంది. రాజ్‌గఢ్‌ పట్టణంలో ఒక కోతి స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. ఇప్పటి వరకు 20 మందిని తీవ్రంగా గాయపరిచింది. ఎనిమిది మంది చిన్నారులపై దాడి చేసింది. దాంతో స్థానికులు చాలా వరకు పనులు మాని ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. కిటికీలకు, ఇంటి చుట్టూ రక్షణకు కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. స్థానికులు దీనిని పట్టుకునేందుకు కర్రలు, తెరలు ఉపయోగించినా ఆ కోతి మాత్రం చిక్కడం లేదు. ఇది దాడి చేయడంతో గాయాలై ఎంతో మంది ఆసుపత్రి పాలయ్యారు. చివరికి ఈ కోతి ఆగడాలను కట్టించేందుకు అధికారులు కదలివచ్చారు.

మున్సిపల్‌ అధికారులు కోతిని పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. జిల్లా కలెక్టర్‌ సహాయంతో వారు ఉజ్జయిని అనే ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందం కోతి కదలికలను గమనించడానికి డ్రోన్‌లను కూడా ఉపయోగించింది. ఆ కోతి సంచరించే ప్రాంతాల్లో పంజరాలను ఏర్పాటు చేసింది. దీన్ని బంధించేందుకు రెండు వారాల పాటు నిఘా వేసింది. దీన్ని పట్టుకోవడంలో అధికారులు, స్థానికులు ఈ బృందానికి సహకరించారు. నాలుగు గంటల పాటు శ్రమించి కోతిని పట్టుకున్నట్లు మున్సిపల్‌ ఛైర్మన్‌ వినోద్‌ సాహు తెలిపారు. కోతిని పట్టుకున్నందుకు ఈ బహుమతిని ఉజ్జయిని బృందానికి ఇవ్వనున్నట్లు చెప్పారు. దీన్ని నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న దట్టమైన అడవిలో విడిచిపెట్టనున్నట్లు అటవీ శాఖ అధికారి తెలిపారు.