Site icon HashtagU Telugu

Viral News : టెక్నాలజీని గుడ్డిగా నమ్మితే.. నేరుగా బీచ్ లోకి తీసుకెళ్లింది

tourists gone into sea through using google maps

tourists gone into sea through using google maps

మనకు తెలియని విషయం గురించి క్షణాల్లో తెలుసుకోవాలంటే.. అరచేతిలో ఉండే ఆరంగుళాల స్మార్ట్ ఫోన్(Smart Phone) ను టక్కున ఓపెన్ చేసి సెర్చ్ చేసేస్తాం. గ్యాడ్జెట్స్, టూరిజం స్పాట్స్, ఆధ్యాత్మిక ప్రదేశాలు, వంట-వార్పు, షాపింగ్, ఎంటర్టైన్మెంట్, పిల్లలు చూసే ప్రోగ్రామ్స్, తినే ఫుడ్ ఇలా ఒకటేమిటి.. దాదాపు అన్నింటికీ స్మార్ట్ ఫోన్ పై ఆధారపడిపోతున్నాం. ఇక ఏదైనా కొత్తప్రదేశానికి వెళ్లినపుడు.. దారి తెలియకపోతే మ్యాప్స్(Maps) సహాయం తీసుకుంటాం. ఒక్కోసారి ఆ జీపీఎస్(Gps) కూడా మనల్ని బోల్తా కొట్టిస్తుంది. ఎంతలా అంటే.. జీపీఎస్ ను నమ్ముకుని గుడ్డిగా వెళ్లిన ఓ జంట నేరుగా వెళ్లి సముద్రంలో పడ్డారు. అయితే ఇది జరిగింది మన దేశంలో కాదు. అమెరికాలోని(America) హవాయి రాష్ట్రంలో.

కైలువా-కోన ప్రాంతంలోని హునోకోహౌ స్మాల్ బోట్ హార్బర్ లోకి ఇద్దరు పర్యాటకులు శనివారం(ఏప్రిల్ 29) భారీ SUVలో వెళ్లారు. మాంటరే ఎక్స్‌కర్షన్ అనే ప్రదేశానికి వెళ్లేందుకు జీపీఎస్ ను అనుసరిస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారి SUV నేరుగా హార్బర్ లోకి వెళ్లి సముద్రంలో పడిపోయింది. ఆ సమయంలో వారిద్దరూ సీట్ బెల్ట్ లు పెట్టుకుని ఉన్నారు. ఆ సమయంలో అక్కడ పడవల్లో ఉన్న సిబ్బంది వారిని గ్రహించి వెంటనే నీటిలోకి దూకి కారులో చిక్కుకున్న ప్రయాణికురాలిని రక్షించారు. మరో వ్యక్తి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. అనంతరం SUVకి తాళ్లు కట్టి ఒడ్డుకు లాగారు. కాగా ఆ ఇద్దరూ తాము సముద్రంవైపు వెళ్తున్నామని గ్రహించకుండా చాలా ఆత్మవిశ్వాసంతో జీపీఎస్ ను నమ్ముకుని కారును వేగంగా డ్రైవ్ చేస్తూ వెళ్లినట్లు తెలిపారు.