హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ జిల్లా, నగ్లా రోడాన్ గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలో ఒక విద్యార్థి క్లాస్‌రూం లో చ్యూయింగ్ గమ్ తింటున్నాడని ఉపాధ్యాయుడు మందలించడంతో, విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి ఉపాధ్యాయులపై దాడి చేశారు. ఈ ఘటన పాఠశాలలో తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో ముగ్గురు ఉపాధ్యాయులు గాయపడగా, ఒకరి ముక్కు విరిగిపోయింది.ఈ ఘటన డిసెంబర్ 13న చోటుచేసుకోగా, ఈ దాడితో తీవ్ర మనస్తాపానికి గురైన ఉపాధ్యాయులు సోమవారం స్కూల్‌కు వెళ్లకుండా నిరసన వ్యక్తం చేశారు. బాధిత ఉపాధ్యాయులు జిల్లా కార్యాలయానికి వెళ్లి అధికారులకు తమ సమస్యను వివరించారు. అధికారుల బుజ్జగింపుతో ఉపాధ్యాయుల ఆగ్రహం కొంతమేర తగ్గింది.
సంస్కృత ఉపాధ్యాయుడు పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 13న సామాజిక శాస్త్ర ఉపాధ్యాయుడు పూర్ణ్ సింగ్ 8వ తరగతి పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో, ఒక విద్యార్థి చ్యూయింగ్ గమ్ తింటున్నాడని గమనించి అతనిని మందలించారు. ఈ మాటలకు కోపగించుకున్న విద్యార్థి క్లాస్‌ను వదిలేసి బయటకు వెళ్లిపోయాడు.కొద్ది సేపటికే బైక్‌పై వచ్చిన విద్యార్థి తండ్రి బల్వాన్ మరియు చిన్నాన్న షేర్ ఖాన్ స్కూల్‌లోకి ప్రవేశించి ఉపాధ్యాయులపై దాడి చేశారు. స్కూల్ కుర్చీలు ఎత్తి కొట్టడం, గొడవ సృష్టించడం వంటి ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడిలో ఒక ఉపాధ్యాయుడి ముక్కు విరిగిపోయింది, మరికొంతమంది ఉపాధ్యాయుల శరీరంపై గాయాలు అయ్యాయి .పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి దాడి చేసిన వారు పారిపోయారు. ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అందులో దాడి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఉపాధ్యాయులపై దాడి జరిగిన ఈ ఘటన పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులలో భయం, ఆందోళన నెలకొంది.