Rajasthan : ఈ కాలంలో సోషల్ మీడియాలో పాపులర్ కావాలన్న మోజు రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా యువత, యువతులతో పాటు కొన్ని కుటుంబాలు కూడా రీల్‌ల పేరిట వెర్రి చేష్టలకు పాల్పడుతున్న సంఘటనలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. కొన్ని సార్లు ఈ చేష్టలు వారి ప్రాణాల మీదకే తెచ్చుకుంటూ, తాము మాత్రమే కాదు.. చుట్టుపక్కలవారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో జరిగిన ఓ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ ఓ జంట తమ ఏడేళ్ల కుమార్తెను ప్రాణాల పణంగా పెట్టి రీల్ చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. బరేథా జలాశయాన్ని సందర్శించిన ఈ దంపతులు తమ చిన్నారి కూతురిని జలాశయ గోడపై ఇనుపకడ్డీలకు ఆనుకొని ఉన్న విద్యుత్ పెట్టెపై కూర్చోబెట్టి వీడియో తీశారు.
ये रील का चक्कर है बाबू भईया!
राजस्थान के भरतपुर में माता-पिता रील के चक्कर में बेटी की जान को खतरे में डाला।#Rajasthan #BarethaDam #Bharatpur pic.twitter.com/8jTwTrVfT5— Surabhi🇮🇳 (@surabhi_tiwari_) July 7, 2025
వీడియో ప్రకారం, చిన్నారి మొదట్లో అక్కడికి వెళ్లడానికే భయపడుతోంది. అయినా ఆ తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహిస్తూ విద్యుత్ పెట్టెపై కూర్చోబెట్టారు. అక్కడుంచిన తరువాత చిన్నారి చేతులు వదిలేసి ఫోన్ వైపు చూడాలని తండ్రి ఆదేశించాడు. చిన్నారి తల్లి కూడా పక్కనే ఉండి వీడియో తీస్తుండటం స్పష్టంగా కనిపిస్తుంది. ఏ క్షణానైనా పట్టు తప్పితే చిన్నారి నేరుగా జలాశయంలో పడిపోయే ప్రమాదం ఉందన్న విషయం వాళ్లకు తెలుసూ లేదా అన్నది ప్రశ్నగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన కొద్ది సేపట్లోనే వేల సంఖ్యలో వ్యూస్, కామెంట్లు వచ్చాయి. అయితే, అందులో మెజారిటీ కామెంట్లు ఆగ్రహంతో నిండిపోయాయి. తల్లిదండ్రులు ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే.. పిల్లల భవిష్యత్ ఎలా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, మరో వ్యక్తి పర్యాటక ప్రదేశాల్లో రీల్స్ పేరుతో ప్రమాదకర స్టంట్లు చేస్తున్నవారిపై కఠిన చర్యలు అవసరం అంటూ అధికారులను కోరారు.
ఈ వీడియో తమ దృష్టికి వచ్చిందని బరేథా పోలీసులు తెలిపారు. వీడియోలో కనిపించిన దంపతులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు బరేథా జలాశయం వద్ద ఓ కానిస్టేబుల్‌ను నియమించినట్లు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు కోసం ప్రాణాలను పణంగా పెట్టడం ఒక ప్రమాదకర ప్రకంపనగా మారుతోంది. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత గురించి బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. “లైక్స్” కోసం “లైఫ్”ను త్యాగం చేయడమా..? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మిగలాలి. సోషల్ మీడియాలో మన్ననలు పొందడం కంటే.. మన జీవిత విలువను, ఇతరుల ప్రాణాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం అనే సంగతిని సమాజం గుర్తించాలి.