ఎస్ఐ చేసిన పనికి షాక్..బుల్లెట్లను ఇలా లోడ్ చేస్తారా?

పోలీసులకు గన్ లో బుల్లెట్లను లోడ్ చేయడం అనేది తెలిసి ఉంటుంది. వారికి దానికి సంబంధించి ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇస్తారు.

  • Written By:
  • Publish Date - December 28, 2022 / 09:29 PM IST

పోలీసులకు గన్ లో బుల్లెట్లను లోడ్ చేయడం అనేది తెలిసి ఉంటుంది. వారికి దానికి సంబంధించి ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇస్తారు. అయితే ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి ఓ సబ్ ఇన్ స్పెక్టర్ తన పైఅధికారులకు షాక్ ఇచ్చాడు. ఆ సబ్ ఇన్ స్పెక్టర్ తుపాకీ గొట్టంలో నుంచి బుల్లెట్లను లోడ్ చేయడంతో అక్కడున్న అధికారులు ఖంగుతిన్నారు.

ఫిరంగి గొట్టంలోకి మందుగుండును దూర్చినట్లుగా తుపాకీ గొట్టంలోకి బుల్లెట్లను ఆ ఇన్ స్పెక్టర్ వేయడం చూసి అక్కడున్నవారంతా పడి పడి నవ్వుకున్నారు. మరికొందరు మాత్రం షాక్ తిన్నారు. ఆ ఇన్ స్పెక్టర్ అంతటితో ఆగకుండా తుపాకీలోకి బుల్లెట్లను వేసే పద్దతి ఇదేనని, అలాగే ఫైరింగ్ చేసే పద్దతి కూడా ఇదేనని, ఇలా చేయడం వల్ల ఎవ్వరికీ గాయాలు కూడా కావని తెలిపాడు.

ఉన్నతాధికారి ఆ సబ్ ఇన్ స్పెక్టర్ చెప్పిన మాటకు ఖంగుతిన్నాడు. తుపాకీలోకి గొట్టం నుంచి బుల్లెట్లు వేశావు కదా, మరి వాటిని ఎలా అన్ లోడ్ చేస్తావు అని పైఅధికారి ప్రశ్నించాడు. దీంతో ఆ సబ్ ఇన్ స్పెక్టర్ వెంటనే ఆ తుపాకీ గొట్టాన్ని కిందికి వంచి తన చేతిలోకి వచ్చిన బుల్లెట్లను తీసి చూపించాడు.

యూపీ డీఐజీ ఆర్.కె.భరద్వాజ్ సంత్ కబీర్ నగర్ లోని పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఠాణాలోని పోలీసుల నైపుణ్యాలను ఆయన పరీక్షించగా ఈ సబ్ ఇన్ స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి వారంతా పడి పడి నవ్వుకుంటున్నారు. దీనికి నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.