Punjab: పంజాబ్‌లో డాక్టర్ల నిర్వాకానికి ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. పంజాబ్‌లోని సాహిబ్జాదా అజిత్ సింగ్ నగర్ జిల్లాలోని బనూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గర్భిణికి చీకట్లో టార్చ్ సహాయంతో ప్రసవం జరిగింది. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అనంతరం పంజాబ్ హెల్త్ సిస్టమ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మణిందర్‌జిత్ సింగ్ విక్కీ ఘనౌర్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు.
మణిందర్‌జిత్ సింగ్ ఆసుపత్రి SMO నుండి సంఘటన గురించి సమాచారం తీసుకున్నారు. బిడ్డ పుట్టబోయే మహిళ బయటి నుంచి వచ్చిందని, ఆటోలో ప్రసవం జరుగుతుందని ఎస్‌ఎంవో తెలిపారు. వెంటనే ఆమెను లేబర్ రూమ్‌కి తరలించగా, కరెంటు పోయింది. ఆ తర్వాత జనరేటర్ స్టార్ట్ చేయగా జనరేటర్ కూడా చెడిపోయింది. ఈ సమయంలో ఆమెను, బిడ్డను కాపాడటానికి డాక్టర్లు టార్చ్ వేసి చీకట్లోనే ప్రసవం చేశారు. అయితే ప్రసవం చేసిన డాక్టర్లను ప్రశంసిస్తున్నప్పటికీ ఆస్పత్రి నిర్వాకంపై ఆందోళన వ్యక్తం అవుతుంది. గర్భిణీ స్త్రీలు వచ్చే ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడం ద్వారా తల్లి బిడ్డలు చనిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పంజాబ్ హెల్త్ సిస్టమ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మణిందర్‌జిత్ సింగ్ విక్కీ ఘనూర్ మాట్లాడుతూ స్థానిక ప్రజల సమాచారం మేరకు ఈ రోజు మంగళవారం ఉదయం తనిఖీ కోసం ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిపారు. ఎవరికైనా ఎలాంటి సౌకర్యం లేకుంటే వెంటనే అందజేస్తామని తెలిపారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పంజాబ్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రతి అడుగు వేస్తోందని, అదే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ సూచనల మేరకు పరిపాలన సాగిస్తోందని ఆయన అన్నారు.