Site icon HashtagU Telugu

Farmers With Crocodile: అధికారులపైకి మొసలిని వదిలి బుద్ది చెప్పిన రైతులు

Farmers With Crocodile

Farmers With Crocodile

Farmers With Crocodile: మన దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. విత్తనం నాటడం నుండి పంట కోత, అమ్మడం వరకు చిన్న పొరపాటు చేసినా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రకృతి ద్వారా పంట నాశనం అవుతుంది. దాంతో రైతులు అప్పులు పాలవుతారు. మరికొన్ని సార్లు ప్రభుత్వాలు, అధికారుల చర్యలతో అన్నదాతలు నష్టపోతున్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, కరెంటు సరైన సమయంలో అందకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇటీవల పగలు కరెంట్ ఇవ్వడం, రాత్రి ఇవ్వడం లేదని విసిగిపోయిన రైతులు ఏకంగా కరెంట్ ఆఫీసుకు మొసలిని తీసుకొచ్చారు.ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

విద్యుత్ అధికారులు పగటిపూట కాకుండా రాత్రిపూట కరెంటు ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విజయపూర్ జిల్లా కొల్హార తాలూకా రోనిహాల్ గ్రామ ప్రజలు గత కొన్ని రోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి విజ్ఞప్తులకు అధికారులు మొండి చెయ్యి చూపిస్తుండటంతో రైతులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలో హెస్కామ్ (హుబ్లీ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్) కార్యాలయానికి ఓ మొసలి వచ్చింది. తాళ్లతో కట్టిన మొసలిని ట్రాక్టర్‌లో తీసుకొచ్చి హెస్కామ్ కార్యాలయం ఎదుట వదిలేశారు. అది చూసి హెస్కామ్ అధికారులు అవాక్కయ్యారు.

కొద్దిరోజులుగా శాంతియుతంగా తమ గోడు వెళ్లబోసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని.. అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని రైతులు అంటున్నారు. రాత్రి వేళల్లో పొలాలకు త్రీఫేజ్ కరెంట్ ఇస్తున్నామన్నారు. చీకట్లో పొలాలకు వెళ్లాలంటేనే భయంగా ఉందని రైతులు వాపోతున్నారు. చీకట్లో పాములు, తేళ్లు, మొసళ్లు, వన్యప్రాణుల వల్ల ప్రాణభయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము పడుతున్న ఇబ్బందులు అధికారులకు కూడా తెలిసేందుకే ఇలా చేశామని స్థానిక రైతులు పేర్కొంటున్నారు.

రాత్రిపూట కరెంటు ఇస్తే ఏం లాభం అని రైతులు ప్రశ్నించారు. తమ సమస్యను అధికారులకు అర్థమయ్యేలా కరెంట్ ఆఫీసుకు మొసలిని తీసుకొచ్చామని స్పష్టం చేశారు. పగటిపూట త్రీఫేజ్ కరెంటు ఇవ్వకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు రైతులకు చెప్పి తీసుకొచ్చిన మొసలిని తీసుకెళ్లారు. దీంతో సమస్య సద్దుమణిగింది.

Also Read: KTR: కర్ణాటకలో కరెంటు కోతలు.. కేటీఆర్ ఇంట్రస్టింగ్ ట్వీట్