Plane Hijack Rumour: ఇటీవల కాలంలో విమానాశ్రయాలు, విమానాలకు సంబంధించి నిరంతర ఆందోళనకరమైన వార్తలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు మరో ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేసినట్లు (Plane Hijack Rumour) సమాచారం వచ్చింది.
ఈ సమాచారం అందడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) సహా భారత భద్రతా సంస్థలు అప్రమత్తం అయ్యాయి. ఈ విమానం ఢిల్లీ నుంచి ముంబై వెళ్తోంది. ఇందులో 126 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఇది నిజం కాదని విచారణలో తేలింది. అలాంటి ఘటనేమీ జరగలేదని విమానం పైలట్ నుంచి సమాచారం అందింది.
నిజానికి ఈ సంఘటన సోమవారం (జనవరి 27) జరిగింది. ఎయిర్ ఇండియా విమానం AI-2957 సోమవారం రాత్రి సుమారు 8:36 గంటలకు ఢిల్లీలోని IGI విమానాశ్రయం నుండి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి విమానం హైజాక్ అయినట్లు సిగ్నల్ అందింది. ఇది చూసి ఏటీసీలో భయాందోళన నెలకొంది. వెంటనే ఈ విషయాన్ని అన్ని భద్రతా సంస్థలకు, ముంబై విమానాశ్రయానికి తెలియజేశారు.
Also Read: Ola Electric Shock: ఓలాకు షాక్.. పడిపోయిన ఎస్1 స్కూటర్ అమ్మకాలు!
హైజాక్ గురించి సమాచారం అందిన వెంటనే.. ముంబై విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, CISF, NSG కమాండ్‌లను మోహరించారు. ఈ సిగ్నల్ గురించి ఇతర విమానాశ్రయాలకు కూడా సమాచారం అందించారు. దీనిపై ఏటీసీ పైలట్‌ను సంప్రదించగా, అంతా బాగానే ఉందని చెప్పాడు. విమానంలో అలాంటిదేమీ జరగలేదని, హైజాక్ అలారం ప్రమాదవశాత్తు అప్రమత్తమైందని పైలట్ తెలిపారు.
డీజీసీఏ విచారణకు ఆదేశించింది
దీంతో సెక్యూరిటీ ఏజెన్సీలు ఊపిరి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన కొందరు ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ విషయంలో భద్రతా సంస్థలు నిర్లక్ష్యం ప్రదర్శించలేదు. విమానం ల్యాండ్ అయ్యే వరకు ముంబై విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌జీ సిబ్బంది మోహరించారు. ల్యాండింగ్ తర్వాత విమానాన్ని తనిఖీ చేశారు. ఇప్పుడు డీజీసీఏతో పాటు పలు ఏజెన్సీలు దీనిపై విచారణ జరుపుతున్నాయి.
ఈ ఎయిరిండియా విమానాన్ని ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రకటించారు. స్థానిక పోలీసులతో పాటు NSG కమాండోలను అక్కడ మోహరించారు. ఈ ఎయిర్ ఇండియా విమానం 9.47కి ముంబై విమానాశ్రయంలో దిగింది, అయితే ప్రయాణికులను గంటపాటు బయటకు రానివ్వలేదు. అంతా బాగానే ఉందని పూర్తిగా తెలిశాక, మొత్తం 127 మంది ప్రయాణికులు విమానం నుండి బయటకు వచ్చారు. అనంతరం ప్రొటోకాల్ ప్రకారం విమానాన్ని వేరే ప్రాంతానికి తరలించారు.