Biscuit Missing : ప్యాకెట్‌లో ఒక్క బిస్కెట్ మిస్సింగ్.. రూ.10 కోట్లు చెల్లించాలన్న వినియోగదారుడు

తాను కొనుగోలు చేసిన బిస్కెట్ ప్యాకెట్(Biscuit Packet) లో.. ప్యాకెట్ పై పేర్కొన్న సంఖ్య కంటే ఒక్క బిస్కెట్ తక్కువగా(Biscuit Missing) ఉండటంతో ఓ వినియోగదారుడు సదరు కంపెనీపై వినియోగదారుల ఫోరంలో(Consumer Forum) ఫిర్యాదు చేశాడు.

  • Written By:
  • Publish Date - September 6, 2023 / 09:00 PM IST

తాను కొనుగోలు చేసిన బిస్కెట్ ప్యాకెట్(Biscuit Packet) లో.. ప్యాకెట్ పై పేర్కొన్న సంఖ్య కంటే ఒక్క బిస్కెట్ తక్కువగా(Biscuit Missing) ఉండటంతో ఓ వినియోగదారుడు సదరు కంపెనీపై వినియోగదారుల ఫోరంలో(Consumer Forum) ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును స్వీకరించిన ఫోరం.. బిస్కెట్ ప్యాకెట్ పై పేర్కొన్న దానికంటే ఒక బిస్కెట్ తక్కువగా ఉండటాన్ని తప్పుపట్టింది. కంపెనీ వాణిజ్య కార్యకలాపాల్లో అనుచితంగా వ్యవహరించినందుకు వినియోగదారుడికి లక్ష రూపాయలు పరిహారం చెల్లించాలని సదరు బిస్కెట్ తయారీ సంస్థను ఆదేశించింది. అలాగే ఆ బ్యాచ్ నంబర్ పై ఉన్న బిస్కెట్ ప్యాకెట్ల విక్రయాన్ని తక్షణమే ఆపివేయాలని సంస్థ స్పష్టం చేసింది.

చెన్నైకి చెందిన ఢిల్లీబాబు అనే వ్యక్తి .. తాను కొనుగోలు చేసిన సన్ ఫీస్ట్ మ్యారి బిస్కెట్ ప్యాకెట్ పై 16 బిస్కెట్లు ఉంటాయని పేర్కొనగా లోపల 15 మాత్రమే ఉన్నాయని ఆరోపిస్తూ స్థానిక జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. అక్రమ వ్యాపార పద్ధతులకు అవలంబిస్తున్న ITC కంపెనీతో పాటు, దానిని విక్రయించిన స్టోర్ పై రూ.100 కోట్లు జరిమానా, తనకు రూ.10 కోట్లు పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరాడు. ఢిల్లీబాబు వాదనతో సదరు తయారీ కంపెనీ విబేధించింది. బిస్కెట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా బరువు ఆధారంగా చూడాలని, తాము బరువు ఆధారంగానే విక్రయిస్తామని వాదించింది.

కానీ.. ఆ కంపెనీ వాదనను వినియోగదారుల ఫోరం తోసిపుచ్చింది. లేబుల్ పై స్పష్టంగా ఇన్ని బిస్కెట్లు ఉంటాయని పేర్కొన్నందున ఖచ్చితంగా దాని ఆధారంగానే వినియోగదారులు కొనుగోలు చేస్తారని, వెయిట్ ప్రకారం ప్యాక్ చేయడం అంటే వినియోగదారుడిని తప్పుదోవ పట్టించినట్లేనని అభిప్రాయపడింది. వినియోగదారుడికి లక్షరూపాయల పరిహారంతో పాటు కోర్టు ఖర్చుల కింద మరో రూ.10వేలు చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో బిస్కెట్ ప్యాకెట్ ను విక్రయించిన స్టోర్ లోపం ఏమీ లేనందున వారిపై ఫిర్యాదును కొట్టివేస్తున్నట్లు తెలిపింది.

 

Also Read : Tata Group – Haldirams : స్నాక్స్ బిజినెస్ లోకి టాటా గ్రూప్.. 83వేల కోట్లతో ‘హల్దీరామ్స్‌’ కొనుగోలుకు చర్చలు !