తాజాగా ఆస్ట్రేలియాలోని ఒక సముద్ర తీరానికి దాదాపు 100కు పైగా పైలట్ తిమింగలాలు కొట్టుకొచ్చాయి. వాటిలో సుమారు 50కిపైగా ప్రాణాలు కోల్పోగా మిగిలిన వాటి ప్రాణాలు కాపాడేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటన తూర్పు అల్బానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలోని చెయిన్స్ బీచ్‌లో చోటు చేసుకొంది. తాజాగా సముద్ర తీరానికి ఒక్కసారిగా డజన్ ల కొద్దీ తిమింగలాలు కొట్టుకొచ్చాయి. అలా కొట్టుకొచ్చిన ఆ తిమింగలాలు చాలా వరకు తీరంలోని ఇసుకలో నిస్సహాయంగా చిక్కుకుపోయాయి.
వీటిని రక్షించడానికి వైల్డ్‌లైఫ్ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. బుధవారం ఉదయం నాటికే దాదాపు 36 పైలట్ తిమింగలాలు మృతిచెందాయి. ఆ తర్వాత క్రమంగా చనిపోయిన తిమింగలాల సంఖ్య 51కి చేరింది. అయితే మిగిలిన వాటిని రక్షించేందుకు యత్నిస్తున్నామని వైల్డ్‌లైఫ్ సర్వీస్ రీజనల్ మేనేజర్ పీటర్ హార్ట్లీ వెల్లడించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రైమరీ ఇండస్ట్రీస్, జీవ వైవిధ్య శాఖ, వన్యప్రాణి సంరక్షణశాఖ అధికారులు ఇక్కడ సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలు ఈ తీరం వద్దకు రావద్దని అధికారులు అభ్యర్థించారు. ఈ పరిస్థితిపై వన్యప్రాణి విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వానిస్సా పిరోట్టా మాట్లాడుతూ.. ఒక్కసారి తిమింగలం ఇసుకలో చిక్కుకొంటే దాని అంతిమ ఘడియలు మొదలైనట్లే అని ఆయన తెలిపారు.
ఈ బీచ్‌లో తిమింగలాల కళేబరాల నుంచి వచ్చే మాంసం వాసన షార్క్ చేపలను ఆకర్షిస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో సముద్రం వద్దకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. పైగా పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలో షార్క్‌ల సంచారం చాలా ఎక్కువగా ఉంటుందని వారు తెలిపారు. పైలట్ వేల్స్ అనే జీవులు చాలా అరుదుగా ఉంటాయని, తిమింగలాలు రెండు మూడేళ్లకు ఒకసారి బిడ్డను కంటాయి. ఆ బిడ్డను పెంచడానికి తల్లి కొన్ని నెలలపాటు తిండీ తిప్పలూ లేకుండా ఉండిపోతుంది. అంతేకాదు,ఆ బిడ్డ పెద్దదై తోడు వెతుక్కునే వరకూ కంటికి రెప్పలా కాపాడుకోవడానికి కొన్ని తిమింగలాలు మళ్లీ గర్భం ధరించకుండా జాగ్రత్తపడతాయట. వీటి సంఖ్య తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణమేనట. పునరుత్పత్తి దశ దాటిన తర్వాత చాలాకాలం జీవించే ప్రాణులు మనిషి తర్వాత తిమింగలాలే. 40 ఏళ్లకల్లా తిమింగలాలు పునరుత్పత్తి శక్తిని కోల్పోతాయి. యాభై అరవై ఏళ్ల వయసులో మెనోపాజ్‌కీ గురవుతాయి. ఒర్కాస్, పైలట్ వేల్స్ అనే రెండు రకాల తిమింగలాలపై ఇరవయ్యేళ్ల పాటు అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.