వామ్మో.. యూరియాతో పాల తయారీ, ఐదేళ్లుగా అమ్మకాలు !!

'శ్రీ సత్య డైరీ ప్రొడక్ట్స్' పేరుతో ఈ ముఠా గత ఐదేళ్లుగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుండటం గమనార్హం. అధికారులు సీజ్ చేసిన రూ. 75 లక్షల విలువైన కల్తీ పాలు, ఆ కంపెనీ సాగించిన దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని ఏళ్లుగా ఎవరికీ అనుమానం రాకుండా, నిత్యవసర వస్తువైన పాలలో

Published By: HashtagU Telugu Desk
Milk Production With Urea

Milk Production With Urea

Milk production with Urea : గుజరాత్‌లో వెలుగు చూసిన నకిలీ పాల దందా సామాన్య ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ప్రాణాలను పణంగా పెట్టి కేవలం లాభాల కోసం సాగుతున్న ఈ దారుణమైన కల్తీ వ్యవహారంపై అంత మాట్లాడుకుంటున్నారు. కేవలం 300 లీటర్ల స్వచ్ఛమైన పాలను ఏకంగా 1,800 లీటర్ల కల్తీ పాలుగా మార్చడం వెనుక భయంకరమైన రసాయన ప్రక్రియ ఉంది. తెల్లగా కనిపించే ఈ పాలలో యూరియా, డిటర్జెంట్, పామాయిల్ వంటి ప్రమాదకర పదార్థాలను కలుపుతున్నారు. యూరియా పాలకు రంగును, డిటర్జెంట్ నురుగును ఇస్తే, పామాయిల్ ఫ్యాట్ కంటెంట్ ఉన్నట్లు భ్రమింపజేస్తుంది. ఈ మిశ్రమం పాల వలె కనిపిస్తున్నప్పటికీ, నిజానికి అది ఒక ప్రాణాంతకమైన రసాయన ద్రవం మాత్రమే.

‘శ్రీ సత్య డైరీ ప్రొడక్ట్స్’ పేరుతో ఈ ముఠా గత ఐదేళ్లుగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుండటం గమనార్హం. అధికారులు సీజ్ చేసిన రూ. 75 లక్షల విలువైన కల్తీ పాలు, ఆ కంపెనీ సాగించిన దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని ఏళ్లుగా ఎవరికీ అనుమానం రాకుండా, నిత్యవసర వస్తువైన పాలలో ఇంత భారీ స్థాయిలో కల్తీ జరగడం ఆహార భద్రతా విభాగం వైఫల్యాన్ని కూడా ఎత్తిచూపుతోంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిరోజూ తీసుకునే పాలలో ఇటువంటి రసాయనాలు కలవడం వల్ల కిడ్నీలు దెబ్బతినడం, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

ఈ ఘటన నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పాలు కొనుగోలు చేసేటప్పుడు కేవలం రంగును, చిక్కదనాన్ని చూసి మోసపోకూడదని సూచిస్తున్నారు. మార్కెట్‌లో దొరికే పాలలో స్వచ్ఛతను గుర్తించడానికి ప్రభుత్వం సూచించిన పద్ధతులను పాటించాలని, పాలలో అసాధారణమైన వాసన లేదా రుచి ఉంటే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఇలాంటి నకిలీ ముఠాలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఇలాంటి వ్యాపార కేంద్రాలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  Last Updated: 07 Feb 2026, 05:33 PM IST