Pull Ups On Signboard : ఇటీవలి కాలంలో కొంతమంది నెటిజన్లకు రీల్స్ పిచ్చి ముదురుతోంది. రైలు పట్టాలపైనా నిలబడి రీల్స్ తీస్తూ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఈవిధంగా రైలు పట్టాలపై నిలబడి రీల్స్ తీసుకుంటూ కొన్ని రోజుల క్రితమే దంపతులు, వారి పసికందు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఓ యువకుడు అత్యుత్సాహంతో నేషనల్ హైవేపై ఉన్న సైన్ బోర్డుపైకి(Pull Ups On Signboard) ఎక్కాడు. ఏం చేశాడంటే..
Also Read :Iran Spy : హిజ్బుల్లా చీఫ్‌ను ఎలా చంపారు ? హసన్ నస్రల్లా ఆచూకీ చెప్పింది అతడే ?
సదరు యువకుడు అమేథీలోని హైవే సైన్‌బోర్డుపైకి కనీసం చొక్కా ధరించకుండా ఎక్కాడు. ఆ సైన్ బోర్డుకు ఉండే ఇనుప రాడ్‌ను పట్టుకొని పుల్ అప్‌లు చేశాడు. భూమి నుంచి దాదాపు 10 మీటర్ల ఎత్తులో అతడు సాహసోపేతంగా పుల్ అప్స్ చేయడాన్ని అందరూ చాలా ఆశ్చర్యంగా చూశారు. ఒకవేళ అతడి చేయి గనుక.. సైన్ బోర్డ్ రాడ్ నుంచి జారితే.. కిందపడి అతగాడి ప్రాణాలు పోతాయి. ఈవిషయం తెలిసినా అతడు సైన్ బోర్డ్ రాడ్‌పై పుల్ అప్స్ చేసేందుకు సాహసించడం గమనార్హం. ఈవిధమైన ప్రమాదకర స్టంట్స్ చేసి వాటితో రీల్స్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంటులో సదరు యువకుడు పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ కావడంతో అందరూ నోరెళ్లబెట్టారు. దీనిపై చాలామంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రీల్స్ వైరల్ కావాలని ప్రాణాలపైకి తెచ్చుకోవడం సరికాదని హితవు పలికారు. రీల్స్ ద్వారా ఫేమస్ కావడం కంటే.. ప్రాణాలను నిలుపుకోవడమే విలువైనదనే విషయాన్ని సోషల్ మీడియా క్రియేటర్లు గ్రహించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రమాదకర స్టంట్లు చేసే వారిని చూసి స్ఫూర్తి పొంది.. అలాంటి కంటెంట్‌ను క్రియేట్ చేయడం వ్యసనం లాంటిదని చెబుతున్నారు. మొత్తం మీద సదరు యువకుడి రీల్స్ వ్యవహారంపై అమేథీ పోలీసులు స్పందించారు. అతగాడు హైవే సైన్ బోర్డుకు వేలాడుతూ పుల్ అప్స్ చేసిన వ్యవహారంపై విచారణ చేస్తున్నామని వెల్లడించారు. ఇటువంటి ప్రమాదకర స్టంట్స్ చేస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ జారీ చేశారు.