పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా.. అంటూ ఒక్క డైలాగ్ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy)..తాజాగా మరోసారి పాల డబ్బా పట్టుకొని సందడి చేసాడు. ఆదివారం మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన మల్లారెడ్డి తనదైన శైలిలో సందడి చేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడ ఉన్న పాల డబ్బాల స్కూటర్‌ను గమనించిన మల్లారెడ్డి ఆ స్కూటర్‌పై ఎక్కి కూర్చుని, తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు తాను కూడా స్కూటర్‌పై పాల వ్యాపారం చేసేవాడినని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా పాల బండిపై కూర్చొని ఫోటోలకు పోజులిచ్చాడు.
పాల వ్యాపారం తన జీవితంలో కీలక ఘట్టమని చెప్పిన మల్లారెడ్డి.. ఆ రోజులు మరిచిపోలేనివని గుర్తుచేశారు. ఒకప్పుడు పాల అమ్మే స్థాయి నుంచి విద్యాసంస్థలు స్థాపించి, వ్యాపారరంగంలో ఉన్నత స్థాయికి ఎదిగానని అన్నారు. పాల అమ్మే వ్యక్తిని శాలువాతో సత్కరించిన మల్లారెడ్డి, కష్టపడితే ఎంత పెద్ద స్థాయికి ఎదగవచ్చో తనదైన శైలిలో వివరించారు. మల్లారెడ్డి పాల బండిపై కూర్చొని ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన సరదాగా పాల డబ్బాలను పట్టుకుని చిరునవ్వుతో ఫోటోలకు పోజులివ్వడం అందరినీ ఆకట్టుకుంది. మల్లారెడ్డి అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారంలో లేకపోయినా తన సరదా స్వభావంతో ప్రజలను ఆకర్షిస్తూనే ఉంటారు. ఎక్కడికి వెళ్లినా తన ప్రత్యేకమైన శైలిలో మాట్లాడుతూ, నవ్వులు పూయిస్తుంటారు.