Salute Iqbal: హ్యాట్సాఫ్ ఇక్బాల్: ఎలక్ట్రిక్ వీల్‌ఛైర్‌ లో ఫుడ్ డెలివరీ చేస్తూ, కుటుంబానికి అండగా నిలుస్తూ!

పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అందుకు ఉదాహరణే ఈ వ్యక్తి.

Published By: HashtagU Telugu Desk
Iqbal

Iqbal

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఎలక్ట్రిక్ వీల్‌ఛైర్‌లో వీధుల్లో తిరుగుతున్న వ్యక్తిని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ఎరుపు రంగు టీ-షర్టు ధరించిన ఈ వ్యక్తి ఇక్బాల్ సింగ్ (44). 75% శారీరక వైకల్యం కలిగి ఉన్నాడు. కానీ ఆలోచనలో 100% స్వతంత్రుడు. ప్రజల కడుపు నింపేందుకు వీల్‌ చైర్‌లపైనే ఫుడ్‌ డెలివరీ చేస్తున్నారు. దాదాపు 12 ఏళ్లపాటు మంచాన పడిన తర్వాత, లాక్‌డౌన్ సమయంలో ఏదైనా పనిచేయాలనుకున్నాడు. ఇక్బాల్ సింగ్ జొమాటోలో జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రస్తుతం అందరిలాగే ఇక్బాల్ సింగ్ డబ్బులు సంపాదిస్తూ, కుటుంబానికి అండగా నిలుస్తూ, రోజుకు మూడు పూటలు హాయిగా తినగలుగుతున్నాడు.

ఇంట్లో ఇద్దరు కుమారులు (ఒకరికి 16 సంవత్సరాలు, మరొకరికి 15), భార్య రాజ్‌విందర్ కౌర్ ఉన్నారు. తండ్రి జ్ఞాన్ సింగ్ ఏడాది క్రితం చనిపోవడంతో కుటుంబ భారం మరి ఎక్కువైంది. బంధువులు, స్నేహితులు ఉన్నా.. ఏ ఒక్కరూ ఆదుకోవడానికి ముందుకు రాలేదు. అయినా అధైర్యపడలేదు. అయితే 2009లో కుటుంబంతో కలిసి వెళ్తుండగా అతని కారు ప్రమాదానికి గురైంది. దీంతో శరీరంలోని భాగాలు 75% పని చేయకుండాపోయాయి. అతని ఛాతీ పై భాగం మాత్రమే పనిచేస్తుంది. ఒక దశలో ధైర్యం కోల్పోయాడు.

2017లో చండీగఢ్‌లో ఇక్బాల్ సింగ్ తొలిసారిగా ఎలక్ట్రిక్ వీల్ చైర్‌ను చూశాడు. లాక్‌డౌన్ 2020లో వచ్చింది. దీంతో వీల్ చైర్ గుర్తుకొచ్చి కంపెనీని సంప్రదించారు. కంపెనీ అర్థం చేసుకొని కొత్త మోడల్‌ను డెలివరీ చేసింది. దీని తర్వాత అతను జొమాటోలో చేరాడు. అతను సాయంత్రం 6 నుండి అర్థరాత్రి వరకు డెలివరీ చేస్తాడు. కుటుంబ పోషణకు సరిపడా సంపాదిస్తాడు. అమృత్‌సర్ ప్రజలు చాలా మంచి వారని ఇక్బాల్ సింగ్ చెప్పారు. ప్రతిఒక్కరూ ఇప్పుడు ఇక్బాల్ ను రియల్ హీరోగా చూస్తారు.

Also Read: Salman Khan: జైలులో నా బాత్‌రూమ్‌ ను నేనే శుభ్రం చేసుకునేవాడ్ని, సల్మాన్ కామెంట్స్ వైరల్!

  Last Updated: 15 Aug 2023, 04:04 PM IST