Python Swallowed Woman : ఆమె పేరు ఫరీదా.. వయసు 50 ఏళ్లు.. దట్టమైన అడవి శివార్లలో వాళ్ల ఊరు ఉంది. ఇటీవల ఇంటి సామాన్ల కోసం అడవిని దాటుకొని స్థానికంగా ఉన్న నిత్యావసరాల మార్కెట్‌కు వెళ్తుండగా ఫరీదా మిస్సయింది. గురువారం(జూన్ 6న) రాత్రి నుంచి ఆమె ఆచూకీ కనిపించలేదు. ఫరీదాకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో.. ఫరీదా భర్త, పిల్లలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి ఊరి శివార్లలో ఉన్న అడవిని జల్లెడ పట్టారు. అయినా ఆమె ఆచూకీ దొరకలేదు. ఇంతకీ ఫరీదాకు(Python Swallowed Woman) ఏమైందో ఎవరికీ అంతుచిక్కలేదు.
We’re now on WhatsApp. Click to Join
చివరకు శుక్రవారం రోజు (జూన్ 7న) ఊరి శివార్లలోని అడవుల్లో 16 అడుగుల భారీ కొండ చిలువ మత్తుగా నిద్రపోతుండటాన్ని వాళ్లు గుర్తించారు. ఆ కొండ చిలువ పొట్ట బాగా ఉబ్బి ఉండటాన్ని చూసి ఫరీదా భర్తకు, గ్రామస్తులకు డౌట్ వచ్చింది. ఎందుకైనా మంచిదని.. ఆ కొండ చిలువను కట్టేసి.. దాని కడుపు చీల్చారు. అయితే కొండ చిలువ కడుపులోనే ఫరీదా ఉండటాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆమె అప్పటికే చనిపోవడంతో ఫరీదా కుటుంబ సభ్యులంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటి సామాన్ల కోసం వెళ్లిన తమ తల్లి విగతజీవిగా మారిందని తెలుసుకొని.. ఆమె నలుగురు పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు. తాను ఒకవేళ ఫరీదాతో కలిసి వెళ్లి ఉంటే.. తప్పకుండా కొండచిలువ నుంచి రక్షించి ఉండేవాడినని ఆమె భర్త చెప్పుకొచ్చాడు. ఈ విషాద ఘటన ఇండోనేషియాలోని దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లో ఉన్న కలెంపాంగ్ గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇండోనేషియా భూభాగంలో అడవులు పెద్ద విస్తీర్ణంలో ఉంటాయి. అక్కడి ఏజెన్సీ ప్రాంతాల్లో పాములు పెద్దసంఖ్యలో సంచరిస్తుంటాయి. ఈవిధంగా మనుషులకు కొండ చిలువలు మింగేసిన ఘటనలు గతంలోనూ ఇండోనేషియాలో చాలానే చోటుచేసుకున్నాయి. తాజా ఘటనలో ఫరీదాను కొండ చిలువ పొట్ట నుంచి బయటకు తీసిన అనంతరం ఆమె ఇంటికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులంతా చూసిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు.