సామాన్యంగా భార్యలు.. భర్త వేధింపుల బాధ తాళలేక రోడ్డెక్కడం, మద్దతుగా మహిళా సంఘాలు నిలవడం మనం తరచూ చూస్తుంటాం. కానీ ఇక్కడ భిన్నంగా మారింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ భర్త తన భార్య కోసం అత్తగారి ఇంటి ముందు ధర్నా చేయడం విశేషంగా మారింది. వినడానికి వింతగా ఉన్నా, ఇది నిజమైన సంఘటన. గాజుల అజయ్ అనే వ్యక్తి తన భార్య శివానిని తిరిగి ఇంటికి తీసుకురావాలని కొన్నిరోజులుగా ప్రయత్నిస్తున్నా, ఆమె ఒప్పుకోకపోవడంతో చివరకు ఏ భర్త చేయని పనిచేసాడు.
Air India Plane: ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం!
అజయ్, శివానితో చిన్న గొడవ తర్వాత ఆమె రెండు సంవత్సరాల కుమారుడితో పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అజయ్ ఎంతలా నచ్చజెప్పినా, పెద్దలని తీసుకెళ్లినా శివాని మళ్ళీ ఇంటికి రావడానికి ఇష్టపడలేదు. “ఇక నీ మీద కోపం పెట్టుకోవడం లేదు, బాగా చూసుకుంటా” అన్నా ఆమె ఒప్పుకోలేదు. దీంతో అజయ్ మహిళా సంఘాల సహాయంతో, ఆమె పుట్టింటి ముందు ధర్నాకు దిగాడు. ఆశ్చర్యంగా మహిళా సంఘాలు కూడా ఈసారి భర్తకు మద్దతుగా నిలవడం చర్చనీయాంశంగా మారింది.
ధర్నాతో కూడా శివాని మనసు మార్చుకోలేదు. “అతని వద్ద నాకు రక్షణ లేదు, ఎప్పుడూ వేధింపులకు గురి చేస్తున్నాడు” అంటూ తన వేదన వ్యక్తం చేసింది. దీంతో నిరాశతో అజయ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.