Site icon HashtagU Telugu

Punjab: డబ్బు కోసం దొంగను వదిలేసారు అంటూ హోంగార్డు నిరసన.. ఫొటోస్ వైరల్?

Punjab

Punjab

మాములుగా పోలీసులు అన్న తర్వాత నేరస్తులను దొంగతనాలు చేసే దొంగలను పట్టుకోవడం అన్నది సహజం.. అలా అరెస్టు అయిన వారు కొందరు శిక్షను అనుభవిస్తే మరి కొందరు వెంటనే పలుకుబడిని ఉపయోగించి బెయిల్ పై బయటకు వచ్చేస్తూ ఉంటారు. అయితే కష్టపడి ఒక దొంగను పట్టుకున్నందుకు డబ్బుల కోసం ఆశపడి వదిలిపెట్టారు అంటూ ఒక హోంగార్డు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. పంజాబ్‌ లోని పఠాన్‌కోట్‌ ప్రధాన రహదారిపై అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

ఒక హోమ్‌గార్డ్‌ రోడ్డు మధ్యలో పడుకొని నిరసనకు దిగాడు. తాను కష్టపడి దొంగను పట్టుకొని అప్పగిస్తే పోలీసులు డబ్బు తీసుకుని అతడిని వదిలేశారంటూ ఆరోపించాడు. నిరసన తెలుపుతున్న హోమ్‌గార్డ్‌ను ఆపే ప్రయత్నంలో ఒక పోలీసు అధికారి అతడిని కాలితో నెట్టడం గమనార్హం. ఈ ఘటనను అక్కడున్న ఒక వ్యక్తి కెమెరాలో బంధించి ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తాను ఒక దొంగను పట్టుకొని భోగాపూర్ పోలీసు స్టేషన్‌కు తరలించానని ఆ హోమ్‌గార్డ్‌ తెలిపారు. కానీ మరుసటి రోజు స్టేషన్‌కు వెళ్లి ఆ దొంగ గురించి ప్రశ్నిస్తే..

అక్కడి పోలీసులు సరైన సమాధానం ఇవ్వలేదని అన్నాడు. దీంతో ఆ హోమ్‌గార్డ్‌ ప్రధాన రహదారిపై నిరసనకు దిగాడు. వాహనాల రాకపోకలను నిలిపేందుకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇనుప చువ్వలకు తాళ్లు కట్టాడు. వెంటనే ఒక పోలీసు అధికారి అతడిని మందలించి ఆ తాళ్లను విప్పటంతో రోడ్డుపైనే పడుకొని నిరసన తెలిపాడు. దీంతో ఆ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అనంతరం ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. గొడవ పడుతున్న ఓ వ్యక్తిని హోమ్‌గార్డ్‌ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఆ వ్యక్తి బెయిల్‌పై బయటకు వెళ్లాడు అని భోగ్‌పూర్‌ స్టేషన్‌ ఇంఛార్జి సుఖ్‌జీత్‌ సింగ్ తెలిపారు. అయితే హోమ్‌గార్డ్‌ను ఎవరూ కాలితో నెట్టలేదని పోలీసులు తెలిపారు.