Groom: గడ్డం కోసం ఏకంగా పెళ్లి ఆపేసిన వరుడు తండ్రి.. చివరికి?

తాజాగా చెన్నైలో ఒక యువకుడి గడ్డం తన పాలిటి శాపం అయింది. మరికొద్ది సేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు తన గడ్డం కారణంగా పెళ్లి రద్దు చేసుకో

  • Written By:
  • Publish Date - August 22, 2023 / 04:30 PM IST

తాజాగా చెన్నైలో ఒక యువకుడి గడ్డం తన పాలిటి శాపం అయింది. మరికొద్ది సేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు తన గడ్డం కారణంగా పెళ్లి రద్దు చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లికి గడ్డానికి సంబంధం ఏంటి? గడ్డం వల్ల పెళ్లి ఆగిపోవడం ఏంటా అనుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే.. కోయంబత్తూరు నగరం పరిధిలోని సూలూరుకు చెందిన ఒక పారిశ్రామికవేత్త తన కుమారుడికి వివాహ ఏర్పాట్లు చేశాడు. మూడు నెలల క్రితం పొల్లాచ్చి ప్రాంతానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. ఇరు వర్గాల పెద్దలు మూడు నెలలుగా పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

అయితే తనకు కాబోయే భార్యతో ఆ పారిశ్రామికవేత్త తనయుడు నిత్యం ఫోన్‌లో బీజీ కూడా అయ్యాడు. ఈ పరిస్థితుల్లో ఆ వరుడు నిత్యం గడ్డంతో కనిపించే వాడు. పెళ్లి సమయానికి గడ్డం తీసి వేసి నీట్‌గా షేవింగ్‌ చేసుకోవాలని తండ్రి సూచిస్తూ వచ్చాడు. అనుకున్నట్లుగా పెళ్లి గడియల సమయం ఆసన్నమైంది. సోమవారం వివాహం బ్రహ్మాండంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇక ఆదివారం తండ్రి ఆదేశాల మేరకు బ్యూటీ ఫార్లర్‌కు వెళ్లి తన గడ్డం తొలగించి నీట్‌గా షేవింగ్‌ చేసుకునేందుకు వరుడు వెళ్లాడు. అయితే బ్యూటీ ఫార్లర్‌లో ఏమి జరిగిందో ఏమోగానీ, గడ్డంను ట్రిమ్‌ చేసుకుని ఇంటికి వచ్చిన తనయుడిని చూసిన తండ్రి ఆగ్రహానికి లోనయ్యాడు.

షేవింగ్‌ ఎందుకు చేసుకోలేదంటూ ప్రశ్నించాడు. తనకు కాబోయే భర్త గడ్డంతోనే పెళ్లి పీటలు ఎక్కాలని, కాస్త ట్రిమ్ చేసుకుంటే చాలని వధువు సూచించినట్లు తండ్రికి వరుడు సమాధానం చెప్పాడు. ఈ సమాధానం తండ్రిని చిర్రెత్తుకొచ్చింది. ఇప్పుడే నాకు గౌరవం ఇవ్వడం మానేసినట్టున్నావ్‌? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గడ్డం తీస్తేనే పెళ్లి అని తేల్చి చెప్పేశాడు. దీంతో ఎవరి మాట వినాలో అయోమయంతో తల్లడిల్లిన ఆ తనయుడు చివరకు తండ్రిని బుజ్జగించే ప్రయత్నం చేశాడు. అయితే, ఏమాత్రం వెనక్కి తగ్గని ఆ తండ్రి తన సోషల్ మీడియాలో సోమవారం జరగాల్సిన తన కుమారుడి వివాహం ఆగిందని, ఎవ్వరూ రావాల్సిన అవసరం లేదని ప్రకటించేశాడు. ఇది వధువు కుటుంబం దృష్టికి చేరడంతో వరుడి ఇంటికి పరుగులు తీశారు. తాను చెప్పినట్టుగా గడ్డం తొలగించకుండా వధువు చెప్పినట్టుగా ట్రిమ్‌ చేసుకొచ్చిన తనయుడు పరిస్థితిని వారికి వివరించాడు. బంధువులు, వధువు కుటుంబం బుజ్జగించినా ఆ తండ్రి ఏమాత్రం తగ్గకపోవడంతో ఉదయం జరగాల్సిన వివాహం ఆగిపోయింది. కాగా తన కంపెనీలోని కార్మికులే గడ్డం పెంచితే తాను ఒప్పుకోనని అలాంటిది కొడుకే ఈ నియమాన్ని ఉల్లంఘించడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సదరు తండ్రి చెప్పడం కొసమెరుపు. ఈ విషయం కాస్త వైరల్ అవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.