ఒక టీచర్ అనగానే విద్యను పంచే మార్గదర్శిగా, మంచి నైపుణ్యాలు కలిగి ఉన్నవాడిగా భావించటం సహజం. అయితే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బలరాంపూర్ జిల్లాలో జరిగిన సంఘటన మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. అక్కడి ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్‌కు ‘ELEVEN’ అనే సాధారణ ఇంగ్లీష్ పదానికి కూడా స్పెల్లింగ్ రాకపోవడం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఓ తనిఖీ సందర్భంగా అధికారులు ఈ పదాన్ని రాయమని అడిగినప్పుడు, టీచర్ తప్పుగా రాయడం అందరినీ షాక్‌కు గురి చేసింది.
ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది. “రూ.70 వేలు జీతం తీసుకుంటూ ఇంగ్లీష్ స్పెల్లింగ్ కూడా రాకపోతే ఎలా?” అంటూ ప్రశ్నించారు. ఒక్క టీచర్ తప్పు కారణంగా మొత్తం ప్రభుత్వ విద్య వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన వారు ఇలాంటి స్థాయిలో ఉండడం బాధాకరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోను చూసినవారిలో చాలామంది “ఇలాంటి టీచర్లతో విద్యా రీత్యా దేశ భవిష్యత్తు ఏంటి?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Banakacharla Project : బనకచర్లపై తెలుగు రాష్ట్రాలతో చర్చిస్తున్నాం – కేంద్రం
ఒకవేళ ఈ టీచర్‌కి ఆ సమయానికి ఒత్తిడి పరిస్థితుల వలన ఇలాంటిదై ఉంటే మరో మాట. కానీ ప్రాథమిక విద్యను బోధించే స్థాయిలో ఉన్నవారు కనీసం పదాలకు సరైన స్పెల్లింగ్ రాయలేకపోతే, అది పెద్ద సమస్యగా మారుతుంది. చిన్నారులకు బోధన అనేది మూసధోరణిలో కాకుండా, అర్థవంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు విద్యా వ్యవస్థ లోపాలను బయటపెడుతున్నాయి.
ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ అధికారులు స్పందించాలని, సంబంధిత టీచర్‌పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే టీచర్ల ఎంపిక విధానంలో నాణ్యత ప్రమాణాలను మరింత కఠినతరం చేయాలని సూచిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును నిర్మించే బాధ్యత ఉన్న టీచర్లు అర్హతగలవారే కావాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.