Golisoda : గోలీ సోడా ఇప్పుడు ట్రేండింగ్ గా మారింది. ఒకప్పుడు పల్లెల్లో సైతం గోలీ సోడా కనిపించేది..ఆ తర్వాత కూల్ డ్రింక్స్ కు అలవాటు పడ్డ ప్రజలు ఈ గోలీ సోడా ను పట్టించుకోవడం మానేశారు. కానీ ఇప్పుడు మళ్లీ గోలీ సోడా కు ఆదరణ పెరుగుతుంది. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వంటి కోల్ బెల్ట్ ప్రాంతాల్లో గోలీ సోడాకు ఉన్న క్రేజ్ చూస్తే మతిపోతుంది.
పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖనిలో వాతావరణ కాలుష్యం మరియు వేడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గంటల తరబడి భూగర్భ గనుల్లో (Underground Mines) ప్రాణాలకు తెగించి పని చేసే బొగ్గు గని కార్మికులు తరచూ అజీర్తి, కడుపు ఉబ్బరం మరియు డీహైడ్రేషన్ వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఇలాంటి సమయంలో ఖరీదైన మందుల కంటే, చిటికెడు ఉప్పు, నిమ్మరసం కలిపిన ‘గోలీ సోడా’నే తమకు తక్షణ ఉపశమనాన్ని ఇచ్చే మందని ఇక్కడి కార్మికులు బలంగా నమ్ముతారు. డ్యూటీ ముగించుకుని బయటకు రాగానే ఆ గోలీని కిందకు నొక్కి, వచ్చే ఆ ‘ఫస్’ అనే శబ్దంతో సోడా తాగితే కలిగే తృప్తి తమ రోజంతా పడ్డ అలసటను మర్చిపోయేలా చేస్తుందని వారు చెబుతుంటారు.
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఆధునిక కూల్ డ్రింక్స్ ధాటికి గోలీ సోడాలు దాదాపు కనుమరుగవుతున్న తరుణంలో, కోల్ బెల్ట్ ఏరియాలో మాత్రం ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఇక్కడ పండ్ల రసాలు, కొబ్బరి బోండాలు ఎన్ని అందుబాటులో ఉన్నా, స్థానికులు మాత్రం గోలీ సోడా వైపే మొగ్గు చూపుతారు. దశాబ్దాల కాలంగా ఇక్కడ అనేక సోడా తయారీ యూనిట్లు నడుస్తున్నాయి. నాణ్యమైన గ్యాస్, స్వచ్ఛమైన నీటితో తయారు చేసే ఈ సోడాలకు ఇక్కడి ప్రజల జీవనశైలిలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందుకే పెద్దపల్లి, మంథని, గోదావరిఖని ప్రాంతాల్లో ప్రతి కూడలిలోనూ గోలీ సోడా బండ్లు దర్శనమిస్తుంటాయి.
గోలీ సోడా అనేది కేవలం దాహం తీర్చే పానీయం మాత్రమే కాదు, అది ఈ ప్రాంత సంస్కృతిలో ఒక భాగమైపోయింది. గోదావరిఖని చుట్టుపక్కల ఉండే తాతల కాలం నాటి సోడా కొట్టుల దగ్గర ఇప్పటికీ రద్దీ తగ్గకపోవడమే దీనికి నిదర్శనం. తక్కువ ధరలో లభించడం, ఆరోగ్యానికి మేలు చేస్తుందనే నమ్మకం, మరియు ఆ పురాతనమైన ‘సౌండ్’ ఇచ్చే కిక్ ఈ సోడాను సజీవంగా ఉంచుతున్నాయి. కాలం మారుతున్నా, టెక్నాలజీ పెరుగుతున్నా, సింగరేణి వాసుల మనసు మాత్రం ఆ గాజు సీసాలో ఉండే గోలీ దగ్గరే ఆగిపోవడం విశేషం.
