Site icon HashtagU Telugu

Maharastra: నలుగురు దళితులను చెట్టుకు వేలాడదీసి కొట్టిన వైనం.. ఎందుకంటే?

Maharastra

Maharastra

ప్రస్తుత సమాజంలో దళితులను చిన్నచూపు చూడడంతో పాటు రోజు రోజుకు వారిపై జరుగుతున్న దాడులు పెరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్లో ఒక దళితుడి పై మూత్రం పోసి దారుణంగా అవమానించి హింసించిన విషయం తెలిసిందే. ఇలా నిత్యం తరచుగా దళితులపై ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా దళిత యువకుడిని కొట్టి అతనితో చెప్పులు నాకించాడు. ఇలాంటి ఘటనలు అని కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇలాంటి చర్యలను అరికట్టడానికి పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా దేశంలో ఏదో ఒక చోట దళితులపై జరుగుతున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా కూడా మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. తమ మేకలను దొంగలించారనే కారణంతో నలుగురు దళిత యువకులను చెట్టుకు కట్టేసి కొట్టి హింసించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా శ్రీరామ్‌పుర్‌ తాలుక పరిధి హరేగాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తమ మేకలు, పావురాలు కనపించక పోవడంతో తమ ఇంటి పక్కన ఉన్న దళిత యువకులపై ఒకరికి అనుమానం వచ్చింది.

దీంతో కొంతమందితో కలిసి ఆగస్టు 25న హరేగాన్‌లో ఆరుగురు వ్యక్తులు దళిత కుటుంబాలకు చెందిన 20 ఏళ్ల వయసున్న నలుగురి ఇళ్లకు వెళ్లి తమవెంట రావాలని అడిగారు. వారు రావడానికి అంగీకరించకపోవడంతో వారిని బలవంతంగా తీసుకెళ్లారు. అనంతరం వారిని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. యువరాజ్ గలాండే, మనోజ్ బోడకే, పప్పు పార్కే, దీపక్ గైక్వాడ్, దుర్గేష్ వైద్య, రాజు బొరాగేలు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఒకరైన శుభం మగడే దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక నిందితులపై హత్యాయత్నం, కిడ్నాప్, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version